సమస్యల పరిష్కారం కోసం.. ఆశా వర్కర్ల మానవహారం
మహబూబాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వేతన బకాయిలు చెల్లించాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నెలకు 18 వేల రూపాయల వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తలు మంగళవారం జిల్లా కేంద్రంలో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీ ఐ టీ యూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నాగన్న, శ్రావణ్, రజిని, సరిత మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా వైద్యరంగంలో పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య సేవలను అందించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మేలు జరుగుతుందని ఆశిస్తే, కనీసం ప్రతి నెల వేతనం కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్పందించి తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని, సీనియర్ ఆశా కార్యకర్తలను రెండవ ఏఎన్‌ఎం గా నియమించాలని, ప్రతినెల 18 వేల రూపాయలను వేతనంగా చెల్లించాలని, పీఎఫ్ , ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలని, పారితోషకం విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు నెరవేర్చెంతవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు జ్యోతి, ఉపేంద్ర, పద్మ, నాగలక్ష్మి, సుకన్య, మాధవి, చంద్రకళ, లక్ష్మీ, అశోక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.




