25 March, 2026 | 3:02 AM

ముందుగా గుర్తిస్తే క్షయను అదుపుచేయవచ్చు

25-03-2026 01:32 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మందమర్రి, మార్చి 24 : క్షయ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే నయం చేయవచ్చునని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అందుగులపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీపీఓ వెంకటేశ్వర్ రావు, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ లతో కలిసి హాజరై మాట్లాడారు.

తెమడ పరీక్ష, ఎక్స్ రే తీసుకోవడం ద్వారా క్షయ వ్యాధిని గుర్తించవచ్చని, సరైన సమయంలో చికిత్స అం దించినట్లయితే పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందన్నారు. కీలు ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రాజ్ కిరణ్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందించడం జరిగిందని, ఈ కిట్లు వినియోగించడం ద్వారా వ్యాధిని ఎదుర్కొనవ చ్చన్నారు. అలాగే ప్రభుత్వం నిశ్చయ భూషణ్ యోజన కింద ప్రతి నెల వెయ్యి రూపాయలు చికిత్స కాలం వరకు అందించడం జరుగుతుందన్నారు. 

జిల్లాలో 759 మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నామని, డిబిటి ద్వారా 150 మంది రోగులకు 6 వేల రూపాయల చొప్పున పోషకాహారం కోసం అందిస్తున్నామన్నారు. అనంతరం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.