12-11-2025 07:49:10 PM
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న తెలుగు,హిందీ పండితుల మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను ఉన్నతీకరించి, పదోన్నతుల ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి,పల్లె నాగరాజు డిమాండ్ చేశారు.
బుధవారం ఆశ్రమ పాఠశాల సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్ తీసుకున్న మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు బడుగు రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరియు బాలుర ప్రాధమికొన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ విద్యారంగం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు పాలకుల దృష్టికి తీసుకోని పోయిన పరిష్కారానికి నోచుకోవడం లేదు అన్నారు.
అందుకే టీపీటీఎఫ్ నవంబర్ 12, 13వ తారీకులలో పాఠశాల స్థాయిలో, 24వ తారీకు నాడు ఐటిడీఏ కార్యాలయం ముందు, డిసెంబర్ 12వ తారీకు నాడు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు మూడు దశల పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది అన్నారు. పండితులతో పాటు గిరిజన పాఠశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టి)లను రెగ్యులరైజ్ చేసి, కనీసవేతనం చెల్లించి ప్రతి నెల ఒకటవ తారీకు నాడు వేతనాలు చెల్లించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్యా సారంగపాణి, మండల ఉపాధ్యక్షులు కనుగంటి సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.