calender_icon.png 9 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు అసలైన శత్రువు ఆసిమ్

09-05-2025 03:49:30 AM

  1. పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్
  2. పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ఇతడే అంటున్న నిపుణులు

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌కు అసలైన శత్రువు అని నిపుణులు పేర్కొంటున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సెంట్రల్ రిజర్వ్‌ఫోర్స్‌ను బలితీసుకున్న సమయంలో ఆసిమ్ మునీర్ ఐఎస్‌ఐ అధిపతిగా ఉన్నాడు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉండి కశ్మీర్‌లోని పహల్గాంలో 25 పర్యాటకులను కాల్చిచంపడంలోనూ ప్రధాన సూత్రధారి అయ్యాడు.

2018లో అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఐఎస్‌ఐ చీఫ్‌గా మునీర్ నియామకాన్ని ఆమో దించినప్పటికీ కేవలం తొమ్మిది నెలల్లోనే తొలగించారు. బహూషా అతితక్కువ కాలం ఐఎస్‌ఐ చీఫ్‌గా పనిచేసినవారిలో ఆసిమ్ మునీర్ నిలిచాడు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా 2022 ఏప్రిల్‌లో సైన్యం తో రూపొందించిన పార్లమెంటరీ తిరుగుబాటుతో ఇమ్రాన్‌ఖాన్ పదవీ కోల్పోవడంలో మునీర్ కీలక పాత్ర పోషించాడు.

ఇమ్రాన్‌ను వ్యతిరేకించే పాలక సంకీర్ణ మద్దతుతో మునీర్ అదే ఏడాది నవంబర్‌లో ఆర్మీ చీఫ్ అయ్యాడు. కొన్నినెలల తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో పెట్టాడు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ మునీర్ ప్రేరేపణతో జరిగిన పహల్గాం దాడికి తగిన గుణపాఠం చెప్పేందుకు భారత్ దూకుడుగా ముందుకెళ్తోంది. 

మునీర్ విస్తృతమైన నిఘా వ్యవస్థ..

ఆసిమ్ మునీర్‌కు గతంలో ఐఎస్‌ఐ చీఫ్ గా, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మునీర్ తన వ్యూహాన్ని సిద్ధం చేసి ఉంటాడని అనుకుంటున్నారు. మునీర్‌ను అంచనా వేసేందుకు అతడి పదవీకాలంలో చేసిన దారుణాలు అనేకం ఉన్నా యి. మునీర్ చీఫ్ అయిన తర్వాత పాలీక్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్న తీరు బాగుందని అమెరికాలోని దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మాన్ అభిప్రాయ పడ్డారు.

పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సైన్యంలో అంతర్గత అసమ్మతులను సమర్థవంతంగా పరిష్కరించాడు. అయితే బలూచ్ తిరుగుబాటుదారులు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేయడంతో అతడి విశ్వసనీయత దెబ్బతింది. మునీర్ తీరుతో పాకిస్థాన్ యువతలో కూడా తీవ్ర అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 

భారత్‌పై అక్కసు..

పాకిస్థాన్‌ను నడిపించడంలో ఆ దేశసైన్యం ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూనే వస్తోంది. 77సంవత్సరాల పాకిస్థాన్‌లో 33 ఏళ్లు మూడు వేర్వేరు దశల్లో మార్షల్ పాలనలో కొనసాగింది. అయితే మునీర్ ఇటీవల కాలంలో పౌరసేవలను కూల్చివేసే అవసరం లేకుండా అత్యంత శక్తివంతమైన ఆర్మీ చీఫ్‌ల్లో ఒకరిగా ఎదిగారు. మునీర్ సైన్యంలో, పాక్ రాజకీయాల్లో అసమ్మతిని తీవ్రంగా అణచివేశాడు. 2023 చివరలో పాకిస్థాన్‌లోని 1.50లక్షల మందికిపైగా ఆఫ్ఘన్ శరణార్థులను బహిష్కరించాడు.

మునీర్ చేసిన ఈ చర్య ఆఫ్ఘనిస్థాన్‌లోని పాలక తాలిబాన్‌తో ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న బలూచ్ తిరుగుబాటు గ్రూప్‌లపై మునీర్ కఠినంగా వ్యవహరించాడు. అయితే బలూచ్ తిరుగుబాటుదారులను భారత్ రెచ్చగొడుతోందని మునీర్ పదేపదే అక్కసు వెళ్లగక్కేవాడు. పహల్గాం దాడికి కూడా ఇదే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.