09-05-2025 03:46:36 AM
న్యూఢిల్లీ, మే 8: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చిరకాల ప్రతీకారం కూడా తీరినట్టు తెలుస్తోంది. ఈదాడిలో 1999 లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్‌కు ప్రణాళిక రచించిన జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు. ఆపరేషన్‌లో భాగంగా బహావల్‌పుర్‌లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్‌పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించగా, అందులో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. రవూఫ్ పలు ఉగ్రదాడుల్లో నిందితు డు. వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యలోనూ ఇతడికి భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పరిశోధన చేస్తున్న పెర్ల్ కొంతమంది మతపెద్దలను కలిసేందుకు 2002లో కరాచీకి వెళ్లాడు. కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు విడిపించిన ఒమర్ షేక్ ఓ హోటల్ నుంచి పెర్ల్‌ను కిడ్నాప్ చేసి హతమార్చాడు.
1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌లో కూడా రవూఫ్ అజహర్ హస్తం ఉంది. ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్-ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు నిర్వహించి.. భారత జైళ్లలో మోస్ట్‌వాంటెడ్ మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకున్నారు.