calender_icon.png 9 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

09-05-2025 02:48:41 AM

  1. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు 
  2. పక్కా స్కెచ్‌తోనే పోలీసులకు ఉచ్చు? 
  3. మృతుల్లో ఒకరు ఘట్‌కేసర్‌వాసి

వరంగల్/మేడ్చల్, మే ౮ (విజయ క్రాంతి)/చర్ల/వాజేడు: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజే డు మండల పరిధిలోని లంకెపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతిచెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాజేడు మండల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ములుగు గ్రేహౌండ్స్ జవాన్లు ఆదివారం తెల్లవారుజాము నుంచే అడవి లో కూంబింగ్ చేపట్టారు.

ఆప రేషన్ మొదలైన కొద్ది గంట ల్లోనే భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఇది రెండు వర్గాల మధ్య తీవ్ర ఎదరుకాల్పులకు దారితీ సింది. అదే సమయంలో మందుపాతర పేలుడు సంభ వించింది. ఎదురుకాల్పులతో కొనసాగి పోలీసు బలగాలను ఆ దిశగా రూట్ మళ్లించినట్టు తెలుస్తున్నది. మావోయిస్టులు వ్యూహాత్మక ప్రణాళికతో భద్రతా బలగాలను మందుపాతర ఉంచిన ప్రాంతానికి వచ్చేలా పథకం వేశారు. ఆ ప్రదేశంలోకి పోలీసులు అడుగుపెడుతున్న క్షణంలోనే ఒక్కసారిగా మందుపాతర పేలింది.

ఘటన అనంతరం మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయినట్టు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఎనిమిది మంది పోలీ సులు తీవ్ర గాయాలపాలై వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందు తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

మృతుల్లో శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో వరంగల్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎస్‌ఐ రణధీర్ది పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించా రు. డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర మృతదేహాలను పరిశీలించారు. 

ఘట్‌కేసర్‌వాసి మృతి

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతిచెందిన ముగ్గురు జవాన్లలో ఒకరు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్‌కు చెందిన తిక్క అశోక్, శోభ దంపతుల కుమారుడు సందీప్ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తు న్నాడు. లంకెపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలి మృతి చెందాడు.

సందీప్ తన చిన్నా నాటి నుంచి పోలీస్ కావాలని తపన పడేవా డు. కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించాడని కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. కాగా తండ్రి చిన్నప్పుడే మృతిచెందగా.. తల్లి శోభ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. మూడు సంవత్సరాల క్రితమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పావనిని సందీప్ వివాహం చేసుకున్నాడు.

మృతుల కుటుంబాలకు సీతక్క పరామర్శ

జవాన్లు మృతిచెందారన్న విషయం తెలు సుకున్న మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీపీ స్టీఫెన్ రవీంద్ర వరంగల్ ఎంజీఎం చేరుకొని మృతుల కుటుంబాల ను పరామర్శించి, ఓదార్చారు. పోలీసు అమరుల మృతదేహాలపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎంజీఎం చేరుకొని నివాళులర్పించారు.