09-05-2025 12:08:46 AM
-సమస్యల సుడిగుండంలో గ్రామాలు
-కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ,
-తాగునీటి కోసం అవస్థలు
-చుట్టం చూపులాగా ప్రత్యేక అధికారులు
-పాలనపై పర్యవేక్షణ కరువు
రంగారెడ్డి, మే 8 (విజయ క్రాంతి ): పల్లె పాలన పడకేసింది.ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో పల్లెల్లో పాలన గాడి తప్పింది. స్థానిక సంస్థల గడువు ముగియడంతో ప్రభుత్వం గత జనవరి నుంచి ప్రత్యేక పాలన కోసం శ్రీకారం చుట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు ఆయా పంచాయతీల్లో పాలన కు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుద్దని ఉద్దేశంతో ప్రభుత్వము ప్రత్యేక అధికారులను నియమించింది.
జిల్లా మండల స్థాయి అధికారులను ఆయా పం చాయతీల జనాభా అనుగుణంగా వారి ని కేటాయించి బాధ్యతలను అప్పగించింది. ఆయా సంబంధిత అధికారులు ప్రతినిత్యం పంచాయతీలో పాలన వ్యవహారాలపై మానిటరింగ్ చేయాలని సమస్యలకు పరిష్కరించాలని వారిని ఆదేశించింది.
కానీ ప్రత్యేక అధికారులకు పాలనకు సంబంధించి ఎలాంటి నిధులు ప్రత్యేకంగా కేటాయించలేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన గాడి తప్పి పల్లెలు సమస్యలు సు డిగుండాలో చిక్కుకొని అల్లాడుతున్నాయి. మెజార్టీ పంచాయతీలు తండాల్లో పారిశుద్ధ్యం కొరవడింది... తాగు నీటి సమస్య వేధిస్తుంది.
దీంతో పల్లెల్లో పాలన ప పర్యవేక్షణ లోపించి సమస్యల సుడిగండ్లలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. మరోపక్క పంచాయతీలో విధులు నిర్వహించే కార్మికులకు సైతం సకాలంలో వేతనాలు అందకా సిబ్బంది పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించింది. పల్లెల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలంతా అవస్థలు గురవుతున్నారు.
చుట్ట చూపు లాగా అధికారుల పర్యటనలు..
జిల్లాలో 21 మండలాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుంది.పల్లెల అభివృద్ధిపై నిరంతరం మానిటరింగ్ చేసే ప్రత్యేక అధికారులు కేవలం చుట్టం చూపు మాదిరిగానే ఆయా పల్లెల్లో పర్యటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించే ఎంపీడీవో, వివిధ శాఖల అధికారుల మధ్య సైతం సమన్వయం లోపం కొట్టు వచ్చినట్లు కనిపిస్తుంది.
పంచాయతీల నిర్వహణకు సంబంధించి కేటాయించిన నిధులకు సంబంధించిన ఫైలు పై సంతకాలు చేసే సమయంలోనే సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పల్లెల్లో పర్యవేక్షణ లోపించింది. మెజార్టీగా పల్లెల్లో తాగు నీటి సమస్యలు మిషన్ భగీరథ పైప్ లైన్లు లీకేజీలు కారణంగా కారణంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
వేసే కాలం సమీపించడంతో మెజార్టీ గ్రామాల్లో భూగ ర్భ జలాలు అడుగంటాయి.పంచాయతీలో సకాలంలో పన్నులు వసూలు కాకపోవడంతో కార్యదర్శులు తలలు పట్టుకుం టున్నారు. పంచాయతీల నిర్వహణకు నిధులు సరిపడక కనీస అవసరాల నిమిత్తం అప్పులు తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది. పంచాయతీల్లో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన టాక్టర్ల నెలవారి ఈఎంలు చెల్లించలేని దుస్థితిలో సైతం పంచాయతీలు ఉన్నాయి.
హరితహారంలో చేపట్టిన నర్సరీల నిర్వహణ నిధులు లేకపోవడంతో ఆయా నర్సరీలోనే మొక్కలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.ఆయా గ్రామాలలో సమ స్యలు విన్నవించేందుకు ప్రజలు సంబంధిత అధికారుల వద్దకు వెళ్తే ఆయా శాఖ అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
మండలాలు,గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా అధికారుల పర్యటనలు ప్రజాప్రతినిధులు పర్యటన సమయంలోనే అధికారులు ప్రత్యక్షమవుతున్నారని.... మిగతా పని దినాల్లో అధికారులు తమ కార్యాలయాలు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు సైతం ఆవేదన వెల్లి బుచ్చుతున్నారు. ఇటీవల ప్రభుత్వం మండలాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది ఆయా మండలాల్లో నిర్వహించిన సదస్సులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దీంతో ఆయా గ్రామాల ప్రజలు పల్లెల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, పారిశుద్ధ నిర్వాణపై దృష్టి పెట్టాలని, అధికారులను అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో ప్రభుత్వం నిర్వహించకపోవడంతో పల్లెల్లో మెజార్టీ సమస్యలు పెరిగిపోతున్నాయని... పల్లెలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.