calender_icon.png 9 May, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడులకు తెగబడ్డ పాక్

09-05-2025 02:28:52 AM

జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌పైకి డ్రోన్లు, క్షిపణులు

  1. అప్రమత్తమైన భారత సైన్యం
  2. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ప్రతిదాడులు
  3. ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్ల కూల్చివేత
  4. ఎనిమిది డ్రోన్లు పేల్చివేత..

న్యూఢిల్లీ, మే 8: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత్ తీవ్రం గా పరిగణించింది.‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో బుధవారం పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. అంతేకాదు.. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. ‘ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది..’ అని స్పష్టం చేసిన కొద్ది  సమయా నికే పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది.

దాడిలో భాగంగానే లాహోర్‌లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సైతం ధ్వంసం చేసింది. లాహోర్‌లోని వాల్టన్ ఎయిర్‌పోర్ట్‌లోనూ దాడులు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఆరు అడుగుల డ్రోన్లు కూలడంతోనే పేలుడు సంభవించి ఉండొచ్చని అక్కడి యంత్రాంగం భావించింది. అలాగే కరాచీలోనూ భారత్ దాడులు చేసింది. పాకిస్థాన్  సాయంత్రం భారత్‌లోని ఐదు రాష్ట్రాలను టార్గెట్ చేసి క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడింది.

పాక్ క్షిపణి శకలాల గుర్తింపు..

పంజాబ్‌లోని మఖాన్‌విండి గ్రామస్తులు గురువారం ఉదయం తమ గ్రామ సమీపంలోని పొలాల్లో పాకిస్థాన్ క్షిపణులకు సంబంధించిన శకలాలను గుర్తించారు. బుధవారం రాత్రి పాక్ ఈ క్షిపణిని ప్రయోగించగా, భారత సైన్యం ఆ క్షిపణిని పేల్చివేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న రక్షణశాఖ గ్రామానికి వచ్చి సదరు క్షిపణి శకలాలను సేకరించింది. మున్ముందు వాటిని పాక్ దాడులకు రుజువులుగా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు చూపించే అవకాశం ఉంది.

తమ ప్రమేయాన్ని కొట్టిపారేసిన చైనా

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ జరిపిన వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ జేఎఫ్17 థండర్లను ఉపయోగించిందని, భారత్‌కు చెందిన చెందిన మూడు యుద్ధ విమానాలు పేల్చేసిందంటూ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని భారత్ కొట్టిపారేయగా, ఈ అంశంపై గురువారం చైనా విదేశాంగ శాఖ సైతం స్పందించింది. తన ఫైటర్ జెట్‌ల ప్రమేయాన్ని ఖండించింది. భారత్, పాక్ సంయమనం పాటించాలని సూచించింది.

కుప్పకూలుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత్‌కు నిషేధించింది. ఈ చర్య పాక్‌కు బాగా దెబ్బతీసింది. నిషేధంగా కారణంగా పాకిస్థాన్ గగనతలం నుంచి వచ్చే లుఫ్తాన్సా, ఎయిర్‌ఫ్రాన్స్‌తో పాటు అనే విమానాలు మరోమార్గాల ద్వారా భారత్ చేరుకుంటున్నాయి. ఫలితంగా పాకిస్థాన్ ఫారెక్స్ విలువ పతనమవుతున్నది. పాకిస్థాన్ ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యంతో పాటు ఓవర్ ఫ్లుటై ఫీజుల సైతం భారీగా కోల్పోతున్నది. 

రంగంలోకి ‘సూసైడ్ డ్రోన్స్’

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాల పేల్చివేతకు భారత సైన్యం ‘సుసైడ్ డ్రోన్స్’ను ప్రయోగించింది. బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ అనే సంస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. ఒక్కో డ్రోన్ సుమారు 5 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. స్కై స్ట్రుకర్స్ దాడులకు సైన్యం ఈ తరహా డ్రోన్లను వినియోగిస్తున్నది.

భారత్‌లోని 15 నగరాలు పాక్ టార్గెట్..

భారత్‌లోని 15 నగరాలను టార్గెట్ చేసుకుని పాకిస్థాన్ దాడులకు తెగబడింది.  బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, జలంధర్, కపుర్తల, చండీగఢ్, భుజ్, ఫలోడి, నాల్, పఠాన్‌కోట్‌లో డ్రోన్లు, క్షిపణుల దాడికి యత్నించింది. ఆ దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. అందుకు భారత సైన్యం ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలను సమర్థంగా వినియోగించింది. 

పాక్ దాడులకు వినియోగిస్తున్న క్షిపణులు చైనాకు చెందిన ‘హెచ్‌క్యూ రక్షణ వ్యవస్థలకు చెందినవని తెలిసింది. కుటిల పాక్ ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన భారత సైన్యం ప్లాన్‌ను భగ్నం చేసింది. మన ఎస్-400 సుదర్శన చక్రతో పాక్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఎస్-400 ఎన్నో లేయర్స్ కలిగిన రక్షణ వ్యవస్థ. ఏకకాలంలో ఇది 400 కిలోమీటర్ల నుంచి డ్రోన్, ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులను సైతం ఇది నాశనం చేస్తుంది.

అంతేకాకుండా ఏకకాలంలో 80 లక్ష్యాలను ట్రాక్ చేసే సామర్థ్యం దీని సొంతం. 600 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా సులభంగా గుర్తించగలదు. ఎస్--400 సుదర్శన చక్రను రష్యాకు చెందిన అల్మాస్ యాంటే కంపెనీ రూపొందించింది. 2018లో రష్యాతో కుదిరిన 5.43 బిలియన్ల ఒప్పందంలో భాగంగా భారత్ దీన్ని సొంతం చేసుకుంది. ఈ ఒక్క అధునాతన వ్యవస్థ మనవద్ద ఉంటే చైనా, పాక్ వంటి దేశాల వైమానిక దాడులను కూడా భారత్ నిలువరించే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.

21 విమానాశ్రయాలు మూసివేత..

దేశంలో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈనెల 10 వరకు దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలను మూసివేయించింది. మరోవైపు పంజాబ్‌లోని సరిహద్దు జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే చార్‌ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాల్లోనూ హైఅలెర్ట్ అమలవుతున్నది. బర్మార్, బికనీర్, శ్రీగంగానగర్ వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి.

ఎవరీ ఉగ్రవాది సాజిద్ మీర్..?

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తన ప్రసంగంలో భారత సైన్యం జరిపిన దాడుల్లో ఉగ్రవాది సాజిద్ మీర్ మృతిచెందినట్లు ప్రకటించారు. దీదంతో అంత ప్రత్యేకంగా సాజిద్‌మీర్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న సర్వత్రా నెలకొన్నది. అయితే.. సాజిద్‌కు 2011లో ముంబైలో జరిగిన ఉగ్రదాడితో ప్రమేయం ఉన్నట్లు, ఆ దాడికి ప్రణాళికలు రచించిన సూత్రధారుల్లో సాజిద్ కూడా ఒకడని తెలిసింది.

నాలుగు రాష్ట్రాల్లో పాక్ దాడులు

భారత్‌లోని జమ్మూ నగరంతో పాటు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడింది. జమ్మూ, పఠాన్‌కోట్, జైసల్మేర్ ప్రాంతాల్లో దాడుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. పాక్ భారత్‌పై ప్రయోగించిన ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్17 ఫైటర్ జెట్లను భారత ఎయిర్‌ఫోర్స్ చాకచక్యంగా పేల్చివేసింది. అందుక ఎస్-400 అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్‌ను వినియోగించింది. జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ నగరంలోని విమానశ్రాయంపైనా పాక్ రాకెట్ ప్రయోగించింది.

దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. భారత్ సైన్యం పాక్ దాడికి ప్రతిగా ఫైటర్ జెట్లతో అనేక డ్రోన్లను ధ్వంసం చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి క్షేత్రస్థాయిలో భారత సైన్యం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. మొత్తంగా భారత ఎయిర్‌ఫోర్స్ ఎనిమిది క్షిపణులు, 13 డ్రోన్లను విజయవంతంగా కూల్చినట్లు రక్షణాశాఖ స్పష్టం చేసింది.

పాక్ దాడుల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని  హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ఊ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉండడంతో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటిచింది.  మరోవైపు పాక్ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో పూర్తి బ్లాక్ అవుట్ విధించింది.

భారత్‌పై ప్రతీకారం తీర్చకుంటామని : పాక్ ప్రధాని ప్రేలాపన..

భారత సైన్యం పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో పా క్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్‌పై తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ప్రేలాపణలు చేశారు. సుమారు గంట పాటు సాగిన తన ప్రసంగంలో భార త సైన్య పోరాటంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం కాల్పులు.. 16 మంది మృతి

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంఛ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో పాక్ సైన్యం మోర్టార్లు, ఫిరంగులతో దాడులకు తెగడపడింది. దాడుల్లో భారత్‌కు చెందిన 16 మంది అమాయకప్రజలు మృతిచెందారు. మృతుల్లో ఒక భారత జవాను కూడా ఉన్నట్లు తెలిసింది.

గగన్‌యాన్ వ్యోమగామిని వెనక్కి పిలిచిన ఎయిర్‌ఫోర్స్

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన తాజాగా మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఎంపికైన వ్యోమగామి అజిత్‌ను వెనక్కి పిలిచింది. తిరిగి విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయానిన వ్యోమగామి అజిత్ అధికారికంగా ధ్రువీకరించారు.