31-10-2025 12:00:00 AM
 
							అధికారుల నిర్లక్ష ్యమే కారణమని విద్యుత్ సంఘాల ఆందోళన
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. దాన్ని తిరిగి ఏర్పాటు చేయడానికి వెళ్లిన అసిస్టెంట్ లైన్మన్ ఓర్సు నరేష్ గారు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. ఈ ఘటన సమయంలో మండల అసిస్టెంట్ ఇంజనీర్ ప్రమాద స్థలంలోనే ఉన్నారని సమాచారం. ప్రమాదం సంభవించడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
దీనికి నిరసనగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి భువనగిరి డివిజన్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ> టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో మన యాదాద్రి జిల్లా అన్ని జిల్లాల కంటే ముందుగా బిల్లులు తీయడం, కలెక్షన్ పూర్తిచేయడం జరుగుతోంది. అయినప్పటికీ కింది స్థాయి కార్మికులపై అధికారులు అధిక ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి కారణంగానే కార్మికులు మానసిక వేదనకు గురై ప్రమాదాలకు గురవుతున్నారు. గత 30 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం, పనులు ఎలా చేయాలో మాకు తెలుసు.
కానీ అధికారులు అనవసర ఒత్తిడి పెంచడం వలన సరిగా విధులు నిర్వహించలేకపోతున్నాం, అని వారు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 అధ్యక్షులు పడిగం యాదగిరి, జిల్లా కార్యదర్శి అమర్నాథ్, విద్యుత్ బీసీ అసోసియేషన్ కంపెనీ కార్యదర్శి బొబ్బిలి మురళి, విద్యుత్ ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దొడ్డి యాదగిరి రాజేష్ 327 యూనియన్ తరఫున కుసంగి శ్రీనివాస్ హెచ్‌ఎంటీ తరఫున బొట్ల రమేష్ గారు జోగు వెంకటేశం, మీర్జా షకీల్ బెగ్, టి. రమేష్ రెడ్డి, పి. సత్యనారాయణ, బాల్ నరసింహ, సిద్ధి లింగం, జి. బాబు గౌడ్, ఎస్. బాబురావు, ఎం.ఆర్. రవీందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర, మహేష్, గోపాల్, భావా సింగ్, జంగయ్య, నందు, స్వరూప, స్వప్న, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.