31-10-2025 12:00:00 AM
రంగారెడ్డి, అక్టోబర్30 (విజయక్రాంతి): పార్టీ విధేయులకే డీసీసీ పీఠం కేటాయించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సత్సంబంధాలు.... ఆర్థిక సామాజికపరంగా పలుకుబడికలిగి ఉండి మొత్తంగా పార్టీకి లాయర్ గా ఉన్న వారికే డిసిసి పీఠం దక్కనుంది. ఆ దిశగానే పార్టీ అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది.
ప్రభుత్వం పార్టీలో ఎలాంటి పదవులు లేని వారికి పార్టీ పగ్గాల ను అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కుతాయని కార్యకర్తలకు గట్టి సంకేతం ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది. ఆదిశగానే పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో కసరత్తులు ప్రారంభించింది. పార్టీ నేతల అభిప్రాయం సేకరించింది. అందరిని సమన్వయం చేసి డిసిసి ఎంపికకు కొలిక్కి తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతుంది.
నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు
డిసిసి ఎంపిక కోసం పార్టీ దూతలు ఏఐసిసి నేత పార్టీ దూతలు ఏఐసిసి పరిశీలకులు ఎంపీ రాబర్ట్ బ్రూస్ ఆధ్వర్యంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల వారిగా కల్వకుర్తి, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు డిసిసి పోస్టు కోసం ఆశావహు ల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించారు.
ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు, ఎమ్మెల్యే,ఎంపీ, ఇంచార్జి మంత్రుల నుంచి వారి అభిప్రాయాలను సైతం క్రోడీకరించింది. జిల్లాలో సామాజికవారిగా డిసిసి కోసం పోటీలో ఉన్న వారి జాబితాను రూపొందించింది. అందులో ప్రధానంగా ముగ్గురు లేదా నలుగురి పేర్లు ను స్కూటీని చేసి ఏఐసీసీకి తుది జాబితాను పంపించింది.
గత వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. నవంబర్ తొలివారం లోనే డిసిసి ప్రకటన ఉంటుందని పార్టీ నేతలుచర్చించుకుంటున్నారు.
రేసులో ఎవరెవరు?
డీసీసీ రేసులో మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ముందు వరుస లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ నేతలు కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉండడం ఆయన ప్లస్ పాయింట్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ రేస్ ఉన్నారు. పార్టీ అధిష్టానం కె ఎల్‌ఆర్ కు టికెట్ కేటాయించడంతో కొంత అసంతృప్తికి గురయ్యారు.
పార్టీ అధిష్టానం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చింది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గంలో పార్టీని నాయకులు,కార్యకర్తలను ఆయన కాపాడుకుంటూ వచ్చారు. ఇదే నియోజకవర్గం లోని మహిళా నేత చిగురింత పారిజాత నరసింహారెడ్డి సైతం మహిళా కోటలో తనకు డిసిసి కేటాయించాలని విశ్వ ప్రయత్నం తెర వెనుక సాగిస్తుంది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేసింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె అధికార పార్టీని వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరింది. మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించింది. సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఉండటంతో మహిళా కోటలు డిసిసి దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఐదేళ్లు పార్టీలో పనిచేసిన వారికి డీసీసీ పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుండడంతో ఆమెకు కొంత మైనస్ గా మారింది.
చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ స్వల్పమెజార్టీతో ఎమ్మెల్యే పదవి చేజారింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతగా చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ నేతల్లో మంచి పట్టు ఉంది. ప్రస్తుతం నియోజకవర్గం పార్టీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.
ఎవరికి వారే..
పార్టీ పదవుల కేటాయింపులో అధికార కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరుగా నేతలు వ్యవరించడంతో పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సివస్తే భీమ్ భరత్ కు సామాజిక పరంగా డిసిసి పీఠం కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం సాగు తుంది. ఆ దిశగా అధిష్టానం సైతం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రధానంగా సామాజిక పరంగా ఓసి నేతలే డీసీసీలుగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక జపం చేస్తుంది.
డిసిసి రేసులో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ కోటలను పరిశీలిస్తారా లేదా అనేది కూడా చర్చ నియాంశంగా మారింది. చేవెళ్ల నియోజకవర్గం చెందిన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వీసీ శేఖర్ గౌడ్, కల్వకుర్తి నియోజకవర్గం చెందిన కడ్తల్ మండలాల పీసీసీ నేత శ్రీనివాస్ గౌడ్, ఎస్టీసెల్ రాష్ట్ర నేత హనుమనాయక్ తో పాటు మొత్తం 16 మంది దాకా డీసీసీ కోసం దరఖాస్తు చేసుకోన్నారు.