08-05-2025 12:29:49 AM
కొన్నాళ్లు వాడి, తర్వాత ఆపేసేవారే 90 శాతం
కామినేని ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీంద్రరెడ్డి
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఆస్తమా ఉందని గుర్తించిన తర్వాత కూడా మందులు సరిగా వాడకపోతే దాని తీవ్రత అధికమవుతుందని కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీంద్రరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఆస్తమా డేని పురస్కరించుకొని సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుభాకర్ కంది, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్స్ డాక్టర్ డీఎస్ సౌజన్య, డాక్టర్ భరత్ జనపాటిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘చాలామంది ఒకసారి వైద్యులకు చూపించుకున్న తర్వాత అప్పుడిచ్చిన మందునే ఎప్పటికీ వాడటం, లేదా కొన్నాళ్లు వాడి ఆపేయడం చేస్తుంటారు. దానివల్ల సరిగా తగ్గదు. అయితే, కొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు వైద్యులకు చూపించుకుంటూ, వాళ్లు సూచించిన మందులే వాడుతుంటారు. అలాంటివాళ్లకు అసలు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమే రాదు. ఇక కొందరు వైద్యులు కూడా రోగులతో తగినంత సమయం వెచ్చించలేకపోతున్నారు.
దానివల్ల వారు రోగి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మందులు ఇవ్వడం, దాంతో అవి సరిగా పనిచేయకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కామినేని ఆస్పత్రికి అన్ని వయసుల రోగులూ వస్తారు. సాధారణంగా ఆస్తమా అనేది చిన్నవయసులోనే బయటపడుతుంది. కొందరికి యుక్తవయసులో వస్తుంది. అరుదుగా 60 ఏళ్లు దాటినవారిలోనూ వస్తోంది. దాన్ని వాళ్లు వయసుతో వచ్చిన సమస్యగా భావించి వదిలేస్తారు’ అని పేర్కొన్నారు.
‘ఆస్తమా అనేది దీర్ఘకాల వ్యాధి. దానికి చికిత్స కూడా ఎక్కువ కాలమే ఇవ్వాలి. పైగా ఇన్హేలర్ వాడటం వల్ల దుష్ప్రభావాలు ఏమీ ఉండవు. మొత్తం ఇన్హేలర్ వాడేవారిలో 30 -40% మంది సరిగా తీసుకోరు. మామూలుగా తీవ్రత తగ్గడానికి ముందు ఇచ్చే మందువల్ల 10 రోజుల్లోనే మంచి ఫలితాలుంటాయి. తర్వాత ఆయాసం రాకుండా ఉండడానికి మందు ఇస్తాం. అది కనీసం మూడు నెలలు వాడాలి.
ఊపిరి పీల్చేటప్పుడు పిల్లికూతల్లాంటివి వచ్చినా, దగ్గు బాగా ఎక్కువగా వస్తున్నా, నడిస్తే ఆయాసం వచ్చినా ఆస్తమా ఉందని అనుమానించాలి. తర్వాత పీఎఫ్టీ పరీక్ష చేయించుకుంటే ఆస్తమా ఉందా లేదా, ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. కామినేని ఆస్పత్రిలో సగటున ఏడాదికి వెయ్యిమంది వరకు ఆస్తమా బాధితులకు చికిత్సలు చేస్తున్నాం అని డాక్టర్ ఈ రవీంద్రరెడ్డి తెలిపారు.