28-10-2025 10:37:14 PM
- గతంలో 80 శాతం పూర్తైన పాలమూరు ప్రాజెక్ట్ పనులు
- ఉదండాపూర్ రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలి
- ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిసెంబర్ 9 హామీని నిలబెట్టుకోవాలి
- ఎమ్మెల్సీ కవిత
- జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పాలమూరులో పర్యటన
జడ్చర్ల: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు నిలిచిపోయాయని, 80 శాతం పూర్తైన ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) డిమాండ్ చేశారు. మంగళవారం జాగృతి జనం బాట కార్యక్రమం పాలమూరు జిల్లాలో భాగంగా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత రైతులకు పరిహారం చెల్లింపులు అన్ని పార్టీలు విఫలమయ్యాయని మానవత దృక్పథంతో భూ నిర్వాసితుల ప్యాకేజీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొన్నారు.
కేసిఆర్ హయాంలో కృష్ణ జలాలను సమృద్ధిగా ఉపయోగించుకున్నారని, మండే వేసవిలోనూ పాలమూరు జిల్లాలో చెరువులు కళకళలాడాయి అన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తాము నష్టపోయినా సరే కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లా రైతులు బాగుపడతారని ఆలోచించి ఉదార స్వభావంతో భూములు ఇచ్చారు. అయితే ఇక్కడి రైతులను ఆదుకోవడంలో మాత్రం అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని కవిత ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టు పనులు ఆపి నారాయణపేట - కొడంగల్ కు నిధులు..
గత ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 80% పూర్తయ్యాయని.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పనులు పూర్తిగా ఆగిపోయాయని తెలిపారు. ఇక్కడ పనులు ఆపేసి నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను ప్రారంభించారని ఇక్కడ 10శాతం డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా భూముల సాగుకు నీరు అందేవని తెలిపారు. భూ నిర్వాసితుల చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం వెనుకాడడం సరైన పద్ధతి కాదన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏ సమయంలో ఇస్తారో ఆ సమయంలో ఉన్న భూముల ధరల ఆధారంగా వారికి డబ్బులు చెల్లించాలని ఈ విషయమై ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు అప్పగించని వేల ఎకరాల విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిసెంబర్ 9లోగా 25 లక్షల పరిహారం అందేలా చూస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గడుపులోగా హామీని నిలబెట్టుకోకపోతే అప్పుడు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని ఆమె తెలిపారు. భూములు కోల్పోయిన యువతకు కూడా ప్రభుత్వమే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే అమలు చేస్తామని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని, తులం బంగారం, 4 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.