calender_icon.png 11 August, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి మోజులో పడి భర్తపై హత్యాయత్నం

31-07-2025 01:12:39 AM

  1. హత్య చేసేందుకు భార్య సుపారి
  2. నలుగురి అరెస్ట్, రిమాండ్
  3. కామారెడ్డి జిల్లాలో ఘటన

ఎల్లారెడ్డి, జూలై 30: ప్రియుడి మోజులో పడ్డ భార్య తన భర్తను అడ్డు తొలగించుకోవడానికి సుపారి ఇచ్చి చంపాలనుకుంది. చివరికి ఆమెతోపాటు ప్రియుడు, సుపారికి వచ్చిన మరో ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన సంపూర్ణ అదే గ్రామంలో ఆశ వర్కర్‌గా పనిచేస్తున్నది.

కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన జాన్సన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. తన సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించి భర్తను కడ తేర్చాలనుకుంది. సుపారి ఇచ్చి కిరాయి రౌడీలను పిలిచి అంతమొందించడానికి ప్లాన్ వేసింది. పథకం ప్రకారం నాగిరెడ్డిపేట మండల శివారు సరిహద్దు ప్రాంతంలోని ఓ వైకుంఠధామం వద్ద ఈ నెల 24న అర్ధరాత్రి 12 గంటలకు హత్య చేయాలని ప్లాన్ వేసింది.

ఈ క్రమంలోనే సంపూర్ణ భర్త రవికి అప్పు ఇస్తామని ఆశ చూపిన జాన్సన్ అతడిని ఈ నెల 24న పెద్దారెడ్డి గ్రామ డంప్‌యార్డు వద్దకు తీసుకెళ్లాడు. జాన్సన్‌తోపాటు తాండూరు గ్రామానికి చెందిన బిక్కనూర్ రాజు, తానుగొండ శ్రీహరి, ఆత్మకూరు గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో రవి తలపై సుత్తితో దాడి చేశారు.

రవి వారినుంచి తప్పించుకుని పారిపోతుండగా వెంబడించి మరీ రాళ్లతో, సుత్తితో దాడి చేశారు. ఆత్మకూరు గేటు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లోకి దూరి ప్రాణాలను దక్కించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపూర్ణతోపాటు జాన్సన్, బిక్కనూర్ రాజు, తానుగొండ శ్రీహరిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.