11-08-2025 01:43:28 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి):
ఏమ్మా.. ఇక్కడ కూర్చున్నావ్. లే ముందుకు పో. మీ సీట్లలో కూర్చో. మీ సీట్లు కాదని మిగతా సీట్లలో కూర్చుంటే ఎట్లా. ఓ మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దబాయింపు.
వీళ్లకు అవకాశం ఇస్తే ముందు నుంచి చివరి వరకు ఉన్న సీట్లన్నీ వీళ్లే కూర్చుంటారు. అంతా వీళ్లే కూర్చుంటే డిపోకు ఖాళీ బ్యాగుతో పోతే వాళ్లతో తలనొప్పులు.. మరో కండక్టర్ ఆవేదన
గతంలో నెలనెలా బస్ పాస్ తీసుకుని వెళ్లే సందర్భంలోనే హాయిగా సీటు దొరికి సమయానికి కాలేజీకి వెళ్లేదాన్ని. ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పుణ్యమా అని కండక్టర్ల చేత మాటలు పడాల్సి వస్తోంది.. ఓ విద్యార్థిని బాధ
రేవంత్‌రెడ్డి సారేమో ఫ్రీ బస్ అంటున్నడు. ఇక్కడ బస్సుల్లో మమ్మల్ని కండ క్టర్లు, పురుష ప్రయాణికులు పూచిక పుల్ల లా తీసేస్తున్నారు. కేవలం మహిళలకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలని చిన్నచూపు చూస్తున్నారు. ఈ ఉచిత బస్సు వల్ల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. ఓ ప్రైవేటు ఉద్యోగిని నిట్టూర్పు
ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని సర్కారు చెబుతోంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం ద్వారా గత నెల 23వ తేదీ నాటికి మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఫలితంగా ఆర్టీసీకి రూ. 6,680 కోట్ల ఆదాయం వచ్చిందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంత పెద్దమొత్తంలో ఆదాయం రావడంతో ఆర్టీసీ గతంలో ఎప్పుడూ లేని విధంగా లాభాల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. వాస్తవంగా ఆర్టీసీపై మహాలక్ష్మి ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ముఖ్యంగా సిబ్బంది పరిస్థితి దారుణంగా తయారైంది. కొత్తగా నియామకాలు లేకపోయినా, చాలా మంది రిటైరై పోతున్నా తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందే డబుల్ డ్యూటీలు చేసి మరీ ప్రభుత్వానికి మహా లక్ష్మి పథకం ఘనత లభించేలా కష్టపడుతున్నారు. అయితే మహాలక్ష్మి జీరో టికెట్లు కాదు.. క్యాష్ ఎంత తెచ్చావంటూ నిత్యం కండక్టర్లకు వేధింపులు తప్పడం లేదని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
60 నుంచి 70శాతం మహిళా ప్రయాణికులే ఎక్కితే పురుషులు బస్సులో ఎక్కడమే గగనంగా మారిందని చెప్పినా అదంతా వినేందుకు డిపో యంత్రాంగం సిద్ధంగా లేదని కండక్టర్లు చెబుతున్నారు. మీరేమైనా చేయండి.. పురుషుల టికెట్లు ఎక్కువగా జారీ కావాలి, బ్యాగులో డబ్బులతో రావాలి, ఖాళీ బ్యాగులతో వస్తే కుదరదు అంటూ నిత్యం ఆదేశాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
అసలేం జరుగుతోంది
ఆర్టీసీకి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం రూ. 6,680 కోట్ల నిధులు ప్రభుత్వం ద్వారా అందాయంటే చాలా పెద్ద మొత్తమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంత డబ్బులు వచ్చినప్పుడు ఇక క్యాష్ కోసం ఎందుకు వేధిస్తున్నారని యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి బస్సుకు సగటున 66.74శాతం మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు, వారి ప్రయాణానికి సంబంధించిన జీరో టికెట్ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు డిపోల్లో ఎందుకు మళ్లీ ప్రత్యేకంగా పురుషుల టికెట్ల డబ్బులు కావాలని ఎందుకు వేధిస్తున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
82% బస్సులు మహాలక్ష్మికే
ఆర్టీసీలో మొత్తం 9,703 బస్సులుంటే అందులో 82శాతం బస్సులు మహాలక్ష్మి పథకం కోసం నడుపుతున్నారని ఆర్టీసీ యాజమాన్యమే ప్రకటించింది. ఇందులో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 5,080 ఉంటే, నగరంలో నడిచే మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు 2,833 ఉన్నాయి. మహాలక్ష్మి పథకానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 45.49 లక్షల మంది ప్రయాణిస్తే.. ఉచిత బస్సు పథకం ప్రారంభమయ్యాక ఆ సంఖ్య ఏకంగా 60.08 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు 14.59 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు.
ఉచిత పథకం ప్రారంభానికి ముందు 40శాతం మాత్రమే ఉన్న మహిళా ప్రయాణికులు పథకం ప్రారంభం తర్వాత 66.74శాతానికి పెరిగారు. నవంబర్ 2023లో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడది ఏకంగా 97శాతానికి పెరిగింది. అంటే ఏ విధంగా చూసినా మహాలక్ష్మి పథకానికి ముందు కంటే తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని అర్థమవుతోంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా క్యాష్ కోసం డిపోల్లో టార్గెట్లు ఎందుకనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందని కార్మికులు వాపోతున్నారు.
మహాలక్ష్మి పథకం రద్దు చేయండి
మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. పథకం ప్రారంభించినప్పటి నుంచి గత నెల 23 వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తే, వారి టికెట్ డబ్బులను ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 6,680 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీని మహిళల ఉచిత ప్రయాణం లాభాల్లోకి తీసుకుపోయిందని కూడా సర్కారు చెప్పింది.
ప్రతి బస్సులో దాదాపు 70శాతం వరకు మహిళలే ఉచితంగా ప్రయాణిస్తున్నారు. బస్సు నిండా మహిళలే ఉండటంతో పురుష ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు. కానీ డిపోల్లో మాత్రం మహాలక్ష్మి జీరో టికెట్ల గురించి పట్టించుకోకుండా పురుష ప్రయాణికుల ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే తీసుకురావాలని వేధిస్తున్నారు.
పురుష ప్రయాణికులను మాత్రమే ఎలా ఎక్కించుకునేందుకు యాజమాన్యం వద్ద ఏమైనా చిట్కాలుంటే చెప్పాలి. సాధ్యం కాకుంటే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయినా ఆపేయాలి. లేదంటే మహాలక్ష్మి పథకం కోసం ప్రత్యేకంగా బస్సులు అయినా నడపాలి. మహాలక్ష్మి పథకం రద్దయితే పురుష ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది.
ఈదురు వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఎంప్లాయిస్ యూనియన్