23-07-2024 04:05:00 AM
దరఖాస్తుకు మరో రెండు వారాలే అవకాశం
మార్గదర్శకాలు విడుదల చేసిన వ్యవసాయశాఖ
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భూముల అమ్మకాలు ఇతర రూపాల్లో చేతులు మారిన రైతుల భూములకు సంబంధించి జూన్ 28వ తేదీలోగా పట్టా పాస్‌బుక్‌లు వచ్చిన రైతులతో పాటు గతంలో రైతుబీమాకు దరఖాస్తు చేయనివారు కూడా చేసుకోవచ్చని పేర్కొంది. అదేవిధంగా రైతుబీమాలో మార్పులు, చేర్పులకు మరోసారి అవకాశం కల్పించింది.
బీమాలో ఆధార్ నామినీ చనిపోయినా, పేరు మార్పు చేయాల్సి ఉన్నా ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో 1965 ఆగస్టు 14 నుంచి 2006 ఆగస్టు మధ్యలో పుట్టిన రైతులంతా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దీని ప్రకారం ఆధార్‌కార్డులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సుగల రైతులు మాత్రమే బీమా పథకానికి అర్హులని వ్యవసాయశాఖ తెలిపింది. దరఖాస్తు పత్రం పూర్తిగా నింపి, పాస్‌బుక్, తహసీల్దార్ డిజిటల్ సంతకం, డీఎస్ పేర్ సహా రైతు ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జీరాక్స్ ప్రతులు జతచేసి స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలని సూచించింది.