17-11-2025 10:35:20 PM
కలెక్టర్ ప్రావీణ్యకు దోమడుగు రైతులు వినతి పత్రం అందజేత
గుమ్మడిదల: కాలుష్య కారక రసాయన పరిశ్రమలను మూసి వేయాలంటూ గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ రైతులు సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పీసీబీ అధికారులు, పోలీసులతో దోమడుగు గ్రామస్తుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. దోమడుగు శివారులోని నీటి చెరువులతో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ప్రజలు, పశువుల ప్రాణాలను హరిస్తూ.. సాగు భూములను దెబ్బ తీస్తున్న దోమడుగు శివారులోని హెటిరో డ్రగ్స్ -1 యూనిట్ ను, ఇతర రసాయన పరిశ్రమలు మూసి వేయాలనీ డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరి సమస్యను తెలుసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ప్రజావాణిలో ఉన్న పీసీబీ అధికారిని వారి వద్దకు పంపారు. ఆందోళనకార్ల వద్దకు వచ్చిన పీసీబీ అధికారి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. అతని తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రసాయన పరిశ్రమలు పంట పొలాల్లోకి కెమికల్ ను వదులుతున్నాయంటూ అతనిపై మండి పడ్డారు. ఈ విషయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వారి వెంట వాటర్ బాటిళ్లలో తెచ్చుకున్న పంట పొలాల్లోనీ కెమికల్ నీటిని కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద ప్రదర్శించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. రైతులు, మహిళలు.. పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకున్నది. కోపోద్రిక్తులైన మహిళలు తమ వద్ద ఉన్న కెమికల్ నీటిని పిసిబి అధికారి పాటక్ కుమార్ పై చల్లడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసుల జోక్యంతో పిసిబి అధికారి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు దోమడుగు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దోమడుగు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.