calender_icon.png 18 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావర్రీ!

23-07-2024 01:32:46 AM

  • భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం
  • రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్ 
  • మంగళవారానికి 55 అడుగులకు గోదావరి
  • కాళేశ్వరం పుష్కర ఘాట్‌ను తాకూతూ ప్రవాహం
  • పెదవాగు గండిని పరిశీలించిన పొంగులేటి
  • గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 22 : వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి ఉద్ధృతి ఏమాత్రం తగ్గట్లేదు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ జితేష్ వీ పాటిల్ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి అధికారులు స్లూయిస్ వద్ద మోటర్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. భద్రాచలానికి ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు ఉపనదులు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. రాత్రి ౧౦ గంటలకు ఇక్కడి నీటిమట్టం ౫౦ అడుగులకు చేరుకుంది.

వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. భద్రాచలం కరకట్ట పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. భద్రాచలం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గోదావరి బ్యాక్ వాటర్ రోడ్లపైకి రావడంతో అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. పలు మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి చేన్లు నీటమునిగాయి. దుమ్మగూడెం మండలంలోని కాశీనగరం, సున్నంబట్టి గ్రామాలకు చెందిన సుమారు 300 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డకు వరద కొనసాగుతోంది. ప్రాణహితకు వరద ఉద్ధృతి పెరిగింది. సోమవారం సాయంత్రం మేడిగడ్డకు 9,54,310 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 85గేట్లు తెరిచి అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.  

కృష్ణమ్మ జలసవ్వడిలు 

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి జూరాలకు 1,69,000 క్యూసెక్యులు ఇన్‌ఫ్లో నమోదవ్వగా 37 గేట్లను ఎత్తి 1,45,410 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్‌కు 29,307 క్యూసెక్కులు, నెట్టెంపాడు కెనాల్‌కు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ 1 కు 1300 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 640 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 584 క్యూసెక్కులు.. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,78,783 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి పరుగులు పెడుతోంది.

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం: కొప్పుల

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా వాళ్ల కుట్రలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార అన్నారు. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్న గోదారమ్మ నీళ్లు నెత్తిన చల్లుకొని వస్తే కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందని హితవు పలికారు.  

శ్రీరాంసాగర్‌లోకి 16 టీఎంసీలు.. 

గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 15.959 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 21.369 టీఎంసీల నీరు నిల్వఉంది. జూన్‌తోపాటు జూలై ఆరంభంలో వర్షాలు లేకపోవడంతో శ్రీరాం సాగర్ వట్టిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పావువంతు నీరుంది. మంజీరాకు ఉపనదులు సింగింతం, కళ్యాణి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు సోమవారం సింగింతం, కళ్యాణి ప్రాజెక్టుల నుంచి నీటిని మంజీరాలోకి విడుదల చేశారు.

మంజీరా ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. మరోవైపు నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా సైతం ఎస్‌ఆర్‌ఎస్పీ నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో రానున్న కొన్ని రోజుల్లో మహారాష్ట్రతో పాటు స్థానికం గా ఉన్న ప్రాజెక్టుల ద్వారా శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది.

మూడు రోజలు వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర చత్తీస్‌ఘడ్ వద్ద అల్పపీడనం, కేంద్రీకృతమై ఉందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా అది కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. ఆవర్తనం  సగటున సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్ది ఆగ్నేయదిశగా వొంగి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగు లాంబ గద్వాల్  జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగితా జిల్లాల్లో ఒక మోస్తరు, సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్

రాష్ర్టంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించినందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. సోమవారం వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ర్టంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఏ విధమైన ప్రాణనష్టం తోపాటు ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్‌ఆర్‌డీఎఫ్, ఎస్‌ఆర్‌డీఎఫ్ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఎన్‌ఆర్‌డీఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా అత్యవసర సాయం కావాలన్నా ఏ సమయంలోనైనా సంప్రదించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అందరు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నారన్నారు.

గర్భిణిని వాగు దాటించిన ఎన్డీఆర్‌ఎఫ్

ఏజెన్సీ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సేవలు ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయికి చెందిన పెయం స్నేహను ప్రసవం కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సురక్షితంగా దవాఖానకు తరలించింది.  సోమవారం సాయంత్రం స్నేహను బోట్ సహయంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు. 108 సిబ్బంది, గ్రామ కార్యదర్శులు ఎన్డీఆర్‌ఎఫ్ టీం సహకారంతో ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు.