23-07-2024 01:07:58 AM
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1,654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కటకం మృత్యుం జయం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు సోమవారం సచివాలయంలో శ్రీధర్‌బాబును కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ గెస్ట్ లెక్చరర్ల వేతనాన్ని ఇప్పుడున్న రూ.28 వేల నుంచి రూ.42 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హా మీ ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వెంకటేశంకు సూచించారు. గెస్ట్ లెక్చరర్ల ప్రతిపాదనల ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రెగ్యులర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ జరుగుతున్నందున వారి నియామకం తర్వాత గెస్ట్ లెక్చ రర్లను తొలగించకుండా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించే విషయం పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.