23-05-2025 01:54:33 AM
మంథని, మే 22 (విజయక్రాంతి)/ మహదేవ్‌పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ రంలో వైభవోపేతంగా సాగుతున్నాయి. కాళేశ్వరుడిని దర్శించుకునేందుకు ఎనిమిదో రోజు గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.
పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, సినీనటుడు అల్లుఅర్జున్ తల్లి నిర్మల నదిలో పుణ్యస్నానాలు చేశారు. భక్తుల ప్రత్యేక పూజలు, హారతులతో ఘాట్ల పరిసరాలు దైవనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం భారీ క్యూలైన్లలో నిలబడి భక్తిని చాటుకుంటున్నారు.
పుష్కర స్నానానికి భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది సహా వాలంటీర్లు సమర్థంగా సేవలందిస్తున్నారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అదనపు ఏర్పాట్లు చేశా రు.
ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, వైద్య సహాయ కేంద్రా లు, విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. పుష్పగిరి పీఠాధిపతి సభినవోద్దండ విద్యాశంకర భారతీ మహస్వామి పుష్కర స్నానం ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని భక్తులకు ఆశీర్వచనం అందజేశారు.
వర్షంలో తడుస్తూనే..
సరస్వతీ ఘాట్ వద్ద నిత్యం నిర్వహిస్తున్న నవరత్న మాలా హారతి అద్భుతంగా కొనసాగుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం పుష్కరాల 8వ రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వర్షంలో తడుస్తూనే కలెక్టర్, ఎస్పీ, భక్తులతో కలిసి హారతిని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సరస్వతి మాతకు ఘనంగా హారతి ఇచ్చి పుష్కరాల పవిత్రతను, మహాత్యాన్ని వివరిం చేందుకు ప్రతిరో జూ కాశీ పండితులతో ఘనంగా సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులు హారతిలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని దర్శించుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు.
ప్రజలందరిలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే విశిష్ట కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాలు మే 26వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరుఉ పాల్గొన్నారు.
పుష్కరాల నిర్వహణపై శైలజా రామయ్యర్ సమీక్ష
సరస్వతీ పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గురువారం ఈవో కార్యాలయంలో సమీక్షించారు. 8 రోజుల పాటు వైభవంగా కొనసాగిన నాలుగు రోజుల పాటు మరింత విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణలో భాగస్వాములైన అధికారులను అభినందించారు.
వచ్చే నాలుగు రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముండటంతో ముందస్తుగా అన్ని విభాగాలతో సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రత, వైద్యం, రవాణా, తాగునీటి, పారిశుధ్యం, వర్షాలు వల్ల విద్యుత్ సమస్యలు, జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.