23-05-2025 01:49:50 AM
పటాన్ చెరు, మే 22 : పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం రోడ్డు ప్రయాణీ కులను హడలెత్తిస్తున్నది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఆ రోడ్డు నుంచి పటాన్ చెరు వెళ్లాలంటేనే వెన్నులో వణుకుపుడు తున్నది. సాహసించి ఎవరైనా వెళ్తే వెన్ను పూసలు కదిలి నడమునొప్పితో చతికిలపడు తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి రోడ్డుది ఇదే దుస్థితి.
ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు నుంచి సాయి కాలనీ, ఇంద్రేశం గ్రామం మీదుగా పెద్ద కంజర్ల వెళ్లె రోడ్డులో దాదాపు రెండు కిలోమీటర్లు రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీళ్లు నిలిచి రోడ్డు తెలియడం లేదు. సాహసించి అలాగే వెళ్తే కార్లు కింద తాకుతున్నాయి.
ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నారు. రోజు ఇదే రోడ్డు నుంచి తిరుగుతున్న అధికారులు ప్రయాణీకుల అవస్థలను, రోడ్డు దుస్థితిని పట్టించుకోవడం లేదు. గుంతలు తేలిన రోడ్డుపై కనీసం మట్టి వేసిన కొన్ని రోజులు సాఫీగా ప్రయాణం జరుగుతుంది.
ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవాలి
పటాన్ చెరు ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు నుంచి ఇంద్రేశం గ్రామందాటే వరకు గుంతలతో ప్రమాదకరంగా మారిన రోడ్డును బాగు చేయాలని ఇంద్రేశం గ్రామస్తులతో పాటు ఇంద్రేశం పరిధిలోని వివిద కాలనీల వాసులు అధికారులను కోరుతూనే ఉన్నారు. నాలుగు వరుసల రోడ్డు, డివైడర్తో రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు క్యాన్సిల్ కావడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
కాగా తక్షణ అవసరంగా రోడ్డు మరమత్తులకు రూ. 50 లక్షలకు టెండర్లు పిలిచామని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఆర్‌అండ్బీ అధికారులు నెల రోజుల క్రితమే తెలిపారు. పనులను త్వరగా చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రయాణీకులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.