18-10-2025 12:32:25 AM
ఆర్ కృష్ణయ్యను కలిసి ప్రకటించిన ఆటో సంఘాల నేతలు
బంద్‌కు మద్దతుగా విద్యానగర్ నుంచి భారీ ఆటో ర్యాలీ
హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనకు శనివారం తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఆటో జేఏసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం రోడ్లపై ఆటోలు తిరగవని, బీసీల న్యాయమైన పోరాటానికి అండగా నిలుస్తామని ఆటో సంఘాల నేతలు స్పష్టంచేశారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో, బీసీ యువజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ నేతృత్వంలో ఆటో జేఏసీ ప్రతినిధులు, బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలిసి మద్దతు ప్రకటించారు.
అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి భారీ ఆటో ర్యాలీని ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆటోలో ప్రయాణించి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలాగే బీసీ ఉద్యమానికి కూడా సబ్బండ వర్గాల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందన్నారు. ‘తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే జేఏసీలు ఏర్పడ్డాయో, అదే తరహాలో బీసీ ఉద్యమం కూడా జేఏసీల రూపంలో ఎగిసిపడటం ఖాయమన్నారు.
ఈ ఆదరణ చూస్తుంటే విధిలేని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయాల్సిందే అని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచి బీసీలంతా బంద్‌కు నేతృత్వం వహించి విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్ దేశ చరిత్రలో బీసీ ఉద్యమానికి ఒక మైలురాయిగా నిలిచిపోవాలని అన్నారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత రాజు, మణికంఠ నేత, ఆటో యూనియన్ సభ్యులు శ్రీనివాస్, రామకృష్ణ జాంగిర్, మల్లేశ్, మహేశ్, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.