14-05-2025 12:00:00 AM
జిల్లా సికిల్ సెల్ కార్యక్రమ అధికారి డా.సుధాకర్ నాయక్
మంచిర్యాల, మే 13 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరికి సికిల్ సెల్, ఎనీమియాపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సికిల్ సెల్ కార్యక్రమ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సికిల్ సెల్, అనీమియా అనేది జన్యుపరంగా బహుళ తరాల వరకు వచ్చే రక్త సంబంధిత వ్యాధి అని పేర్కొన్నారు. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారి, సరైన రక్త ప్రసరణను అడ్డగిస్తాయని, ఫలితంగా శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, తీవ్రమైన నొప్పులు, బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు వంటి పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.
ఇది ఎక్కువగా ఆదివాసీ ప్రాంతాల్లో జన్యుపరంగా ఒక తరానికి మరో తరానికి సంక్రమించే వ్యాధి అని, ఇద్దరు కేరియర్లు (వ్యాధి జన్యువును కలిగినవారు) వివాహం చేసుకున్నపుడు, వారికి జన్మించే పిల్లలలో సికిల్ సెల్ అనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులలో సకాలంలో నిర్ధారణ, జాగ్రత్త చర్యలు, జన్యు సలహాలు తీసుకోవడంపై అవగాహన కల్పించటం అత్యవసరమన్నారు.
అనంతరం సిబ్బందికి, విద్యార్థులందరికీ సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ శివ ప్రతాప్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, సీ హెచ్ ఓ రామమూర్తి, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బంది దివ్య, శైలజ, గీత, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.