31-07-2025 07:52:15 PM
కుభీర్: ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మారుమూల గ్రామమైన ధార్ కుభీర్ లో గురువారం గ్రామస్తులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం కష్టపడి సంపాదించిన వాటికి విలువ, గుర్తింపు ఆర్థిక అక్షరాస్యతతోనే సాధ్యమని పేర్కొన్నారు.
భవిష్యత్ ప్రణాళికలను అది కీలక పాత్ర పోషించాను ఉందని తెలిపారు. నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు భీమా సదుపాయాలపై వివరించారు. యువత, మహిళలు, రైతులు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ దిశగా గ్రామంలోని ప్రతి ఒక్కరు అవగాహన పెంచు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
బ్యాంకుల ద్వారా లభించే జన సురక్ష, పీఎం విశ్వకర్మ యోజన, ముద్ర, పీఎం ఈజిపి, పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన లాంటి రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవన విధానంలో పొదుపు అనేది ఎంతో ముఖ్యమైందని పొదుపును అలవాటు చేసుకోవాలని అన్నారు. పొదుపు ఆవశ్యకతను వివరించారు. గ్రామస్తులందరూ ఐక్యమత్యంగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుకోవాలని కోరారు.