calender_icon.png 2 August, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెస్ట్ రూం, సేఫ్టీ లాకర్ల ఏర్పాట్లను మరిచిన గుర్తింపు సంఘం

31-07-2025 07:55:56 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని భూగర్భ గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం గని ప్రాంగణంలో రెస్ట్ రూములు, సేఫ్టీ లాకర్లను ఏర్పాటు చేస్తామని గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఏఐటియుసి హామీ ఇచ్చి గుర్తింపు సంఘంగా గెలిచి నప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కార్యదర్శి అల్లి రాజేందర్ విమర్శించారు. ఏరియాలోని కేకే 5 గనిపై గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు.

గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్మికులకు బాట బూట్లు ఇప్పిస్తామని అన్ని గనుల్లో ప్రచారం చేసిన ఏఐటియుసి నాయకులు కార్మికులకు సకాలంలో బూట్లు పంపిణీ చేయకుండా యాజమాన్యంతో మాట్లాడామని చెప్పి తప్పించుకుంటున్నారని ఆయన మండి పడ్డారు. స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికుల దుస్తులు, బూట్లు, హెల్మెట్ వంటివి భద్రపరచు కోవడానికి సేఫ్టీ లాకర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నదని చెప్పిన గుర్తింపు సంఘం నాయకులు ఇప్పటివరకు ఏ ఒక్క గనిపై  రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్లు కొత్తవి ఏర్పాటు చేసిన పాపాన పోలేదన్నారు.

పాతకాలం షెడ్లల్లోనే బట్టలు, బూట్లు భద్రపరుస్తూ, వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు ఇవ్వాలని అడగడమే తప్ప ఇప్పటివరకు ఇప్పించలేక పోయారని, స్ట్రక్చరల్ సమావేశంలో మాట్లాడమని చెబుతూ, ప్రతిపక్షాలను విమర్శించడమే, పనిగా పెట్టుకున్నారని గుర్తింపు సంఘం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కార్మికులకు రిటైర్మెంట్ రోజున బెనిఫిట్స్ అందజేస్తామని చెప్పిన గుర్తింపు సంఘం నాయకులు సన్మానాలకే పరిమితమవుతున్నారే తప్ప  బెనిఫిట్స్ ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దురదృష్ట వశాత్తు కార్మికులు చనిపోతే వారికి ఫార్మర్ అండ్ సర్వైవర్ ఎకౌంటు ఉన్న వారి  నామినీ లకు పెన్షన్ రావడం లేదని దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబర చాలని కోరారు. అలవెన్స్ లపై ఆదాయపు పన్ను మాఫీని అధికారులకు ఎలాంటి కమిటీ లేకుండా అమలు చేస్తున్న యాజమాన్యం కార్మికులకు అమలు చేయడానికి కమిటీకి ఒప్పుకున్న ఘనత గుర్తింపు సంఘం ఏఐటియుసికి దక్కుతుందన్నారు.