28-10-2025 03:21:20 PM
- మండల వ్యవసాయాధికారి సుధాకర్
భీమారం,(విజయక్రాంతి): మండలంలో పత్తి సాగు చేసిన రైతులు ఏరిన పత్తిలో తేమ శాతం ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరిన తర్వాతే సీసీఐ (CCI) కి తీసుకెళ్లాలని మండల వ్యవసాయ అధికారి (MAO) అత్తే సుధాకర్ (ATTE SUDHAKAR) కోరారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు కపాస్ కిసాన్ యాప్ (KAPAS KISAN APP) ద్వారా పత్తి అమ్మకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పత్తిలో తేమ శాతం (MOISTURE PERCENTAGE) 8-12 % ఉన్న పత్తిని మాత్రమే అమ్మడానికి సీసీఐకి తీసుకెళ్లాలన్నారు. తేమ 12 శాతం మించితే ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేయరన్నారు.
నేరుగా స్లాట్ బుకింగ్...
ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ (KAPAS KISAN APP) ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ (SLOOT BOOKING) చేసుకోవచ్చని ఏఓ అత్తె సుధాకర్ రైతులకు సూచించారు. రైతులు వారి మొబైల్ ఫోన్ల సహాయంతో పత్తి అమ్మేందుకు స్వయంగా స్లాట్ బుకింగ్ ఎలా చేసుకునేలా అవగాహన కల్పించారు. రైతులు వాడకంలో లేని మొబైల్ నంబర్ల (MOBILE NUMBERS)ను కపాస్ కిసాన్ యాప్ వాడేందుకు తక్షణమే సవరించుకోవాలని సూచించారు. అనంతరం స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో రైతులకు ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) బొల్లంపల్లి అరుణ్ కుమార్ (BOLLAMPALLI ARUN KUMAR), మండల పరిధిలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.