28-10-2025 03:24:55 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ఎంపీడీవోగా పనిచేస్తున్న కె. మహేందర్ వేధింపులు తట్టుకోలేక కార్యాలయంలో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దుగుట భార్గవ్ అనే ఉద్యోగి మానసిక వేదనకు గురై అనారోగ్యంతో మృతి చెందారు. కాసిపేట మండలంలోని ముత్యం పల్లి గ్రామానికి చెందిన దుగుట భార్గవ్ గత 8 ఏళ్లుగా బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మండల పరిషత్ అధ్యక్షుల పదవీ కాలం ముగియడంతో కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు.
మండలంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక నాయకునికి కొమ్ము కాస్తూ ప్రతి నెల వివిధ శాఖల ఉద్యోగుల నుండి లంచం రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్ మానసిక వేధింపులు భరించలేక పలు శాఖల ఉద్యోగులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎంపీడీవో చిన్న చూపు చూసిన సందర్భాలు అనేకం. రాజకీయ నాయకుల అండదండలతో మండల పరిషత్ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉద్యోగులను, సిబ్బందిని వేధిస్తూ నెలనెలా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడు.
ఎంపీడీవో మహేందర్ వేధింపులు తాళలేకనే ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ అనారోగ్యానికి గురై మంగళవారం మృతి చెందడం సహ ఉద్యోగులతో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీడీవో కార్యాలయానికి గ్రామాల నుండి ఎవరు ఏ పని మీద వచ్చిన చిరు నవ్వుతో పలకరించే దుగుట భార్గవ్ వేధింపుల వల్ల అనారోగ్యానికి గురై మృతి చెందడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందరి ముందే చులకనగా మాట్లాడుతున్నారు: కార్యాలయ ఉద్యోగులు
ఎంపీడీవో కె మహేందర్ కార్యాలయంలో అందరి ముందే చులకనగా మాట్లాడుతూ నిత్యం ఇబ్బందులు పెడుతున్నాడని కార్యాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మండలానికి చెందిన ఒక నాయకుని అండ చూసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు గోడువెల్లబోసుకుంటున్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన వెంటనే ఫీల్డ్ విజిట్ పేరుతో ఏదో ఒక గ్రామానికి వెళ్లి క్లస్టర్ లోని ఈజీఎస్ సిబ్బందికి మెమోలు జారీ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
ప్రతినెల రూ. 10 వేలు తమ క్లస్టర్ ఉద్యోగుల నుండి లంచంగా ఎంపీడీవో మహేందర్ కు చెల్లిస్తున్నామని ఈజీఎస్ ఉద్యోగి అనిల్ చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. గత కొన్ని నెలలుగా ఎంపీడీవో లంచాల బాగోతం సాగిస్తున్న ముందుకు వచ్చి చెప్పుకోలేక సిబ్బంది కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్గవ్ మృతి పై జిల్లా ఉన్నత అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ ఉద్యోగులను లంచాల కోసం వేధిస్తున్న ఎంపీడీవో మహేందర్ పై వేటు వేయాలని ఈజీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి: దళిత సంఘాల డిమాండ్
బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పలు శాఖల ఉద్యోగులను లంచాల కోసం వేధిస్తూ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ మరణానికి కారణమైన ఎంపీడీవో కె. మహేందర్ ను విధుల నుండి సస్పెండ్ చేయాలని మంగళవారం మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, నేతకాని మహా నాయకులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు భార్గవ్ మరణం పై విచారణ జరపాలని కోరారు. ఎంపీడీవో మహేందర్ పై చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.