28-10-2025 08:15:14 PM
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ.33 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం..
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పోషణ మాసం మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి సంప్రదాయ పద్ధతిలో చీరలు, గాజులు, పూలు, పండ్లు అందజేశారు. ఆ తర్వాత నూతనంగా జన్మించిన పిల్లలకు అన్న ప్రాసన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, బలమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి గర్భం నుంచే పునాది జరగాలన్నారు. తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోగలిగితే పుట్టబోయే పిల్లలు కూడా బలంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, ఆరోగ్య అవగాహన పెంపొందించడం చాలా అవసరమని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం అంగన్వాడీలు చేస్తున్న కృషిని అభినందించారు. మారుతున్న మన ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం చెడిపోతుందని, వివిధ రోగాలకు గురవుతున్నామని అన్నారు. మళ్ళీ మన పాత ఆహారపు పదార్థాలు జొన్నలు, సజ్జలు, రాగులు, మిల్లెట్స్(చిరుధాన్యాలు) వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని.. గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం, వారికి అందిస్తున్న పౌష్టిక ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో 39,120 కుటుంబాలు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా లబ్ది పొందుతున్నాయని అంగన్వాడీ కేంద్రాలకు 40 టాయిలెట్స్ మంజూరు అయ్యాయని త్వరలోనే వాటి నిర్మాణాలు పూర్తి చేస్తామని, నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణాలను కూడా చేపడుతామని అన్నారు. అనంతరం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో మక్కా జొన్న సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ. 33 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొడప్గల్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చిప్ప మోహన్, పిఎసిఎస్ చైర్మన్, హనుమంత్ రెడ్డి,పి.నాగిరెడ్డి ,మల్లప్ప పటేల్, శామప్ప పటేల్, బసవరాజ్ దేశాయ్, కల్లూరి పండరి, అహ్మద్, శ్రీనివాస్ గౌడ్, బొమ్మల నాగరాజ్, సయ్యద్ ఫెరోజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.