17-09-2025 06:28:34 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిషత్ పాఠశాలలో ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆరో రోజు సేవా కార్యక్రమంలో విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు, యోగా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన ఆహారం అనే అంశాలపై విద్యార్థులకు వివరంగా సమాచారాన్ని అందించారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విద్యార్థులతో చర్చల మాధ్యమంగా ఈ అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.
బాలల భద్రతకు అవసరమైన గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన మంచి ఆహారపు అలవాట్లు, దాని వల్ల కలిగే లాభాలు, అనారోగ్యకరమైన ఆహారం వల్ల వచ్చే నష్టాలను కూడా విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ చిన్నపాటి యోగా ప్రాక్టీస్‌ను నిర్వహించారు. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేసింది.