calender_icon.png 17 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

17-09-2025 07:42:42 PM

పాల్గొన్న రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే..

రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): విశ్వకర్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్(Chairman Dr. Bellaiah Naik), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్రై కార్ చైర్మన్ బిల్లియ నాయక్ మాట్లాడుతూ క్రీస్తుపూర్వం వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాలలో విశ్వకర్మ భగవానుని గురించి ప్రస్తావించబడిందని ఆనాటి కాలంలో విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం, శిల్ప కల, నిర్మాణ శాస్త్రం, యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడు అని పేర్కొన్నారు. ప్రతి శిల్పం, యంత్రం, సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందని అన్నారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలం అని ఆయన వారసులుగా విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులు చేస్తూ సమాజానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. విశ్వ కర్మలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని ప్రభుత్వం కుల వృత్తులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. కొన్నిచోట్ల దేవాలయాల్లో విశ్వకర్మలు పూజారులుగా కొనసాగుతున్నారని వారికి ప్రభుత్వం తరఫున దీప దూప నైవేద్యాల పథకం ద్వారా గౌరవ వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, సహాయ సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.