23-01-2026 12:52:40 AM
శంకర్ పల్లి, జనవరి 22: విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో మోకిల పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి రోడ్డు నియమాలపై చైతన్య పరిచారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని మోకిల ఇన్స్పెక్టర్ వీరబాబు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మరియు త్రిబుల్ రైడింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే ’dial 100’ కు కాల్ చేయాలని, పోలీసులు తక్షణమే స్పందిస్తారని భరోసా ఇచ్చారు. ‘విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి.‘ - వీరబాబు, మోకిల ఇన్స్పెక్టర్ కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిఐ, సమరం రెడ్డి, ఎస్‌ఐలు ధర్మ, రాథోడ్, పద్మ, మండల విద్యాధికారి అక్బర్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.