calender_icon.png 23 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చిన మాజీ జెడ్పీచైర్‌పర్సన్

23-01-2026 12:52:47 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక

కరీంనగర్, జనవరి 22 (విజయ క్రాంతి): తాజా మాజీ జెడ్పీ చైర్ పర్సన్, టిఆర్‌ఎస్ నాయకురాలు కనుమల్ల విజయ గణపతి బి ఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపిలో చేరారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో విజయగణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి బండి సంజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.

వారితోపాటు జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అభివ్రుద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ము న్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే సాధ్యమైందని తెలిపారు.

స్మార్ట్ సిటీ, అమ్రుత్ 1, 2, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతోపాటు 14, 15, 16వ ఆర్ధిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో “అభివ్రుద్దే మా విధానం... హిందుత్వమే మా నినాదం” పేరుతో ప్రజల వద్దకు వెళతామని తెలిపారు. కాం గ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నయని తెలియడంతో ఓట్ల కోసం అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో కాంగ్రెస్ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేసి ఏం లాభమని, గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. బీజేపీని ఆశీ ర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకురావడంతోపాటు సీఎస్సార్ నిధులను సైతం తీసుకొచ్చి అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బీజేపీ జమ్మికుంట నేతలు ఆకుల రాజేందర్, పుప్పాల రఘు, తదితరులు పాల్గొన్నారు.