20-08-2025 08:58:43 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): పత్తి పంటలో గులాబిరంగు పురుగు, కాయతొలుచు పురుగుల నియంత్రణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఎల్డిసి,కారుణ్య యువజన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎల్డిసి ప్రతినిధులు అఖిలేష్, కల్పిష్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో వర్షిత రెడ్డి ముఖ్య అథితులుగా హాజరై రైతులకు పత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలను చేశారు.
రైతులు పత్తి గింజలు విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించాలని అనంతరం లింగాకర్షణ బుట్టలు అమర్చి వరుసగా మూడు రోజులు బుట్టలతో ఎనిమిది తల్లి రెక్క పురుగులు పడటం గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, గుడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలని, మందులు ఉదయం పూట పదిగంటలోపు పిచికారి చేయాలని అన్నారు. ప్రతి పంట జనవరి తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేనులో ఉంచకూడదని పంటకు నీరు ఎరువులు పెట్టి పంట కాలాన్ని పొడిగించకూడదని పత్తిలో నాణ్యతను పెంచుకోవడానికి ఈ లింగాకర్షణ బుట్టలు విరివిగా రైతులు వాడాలని అన్నారు.