20-08-2025 11:10:58 PM
జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సత్వర వ్యాధి నిర్ధారనే క్షయ వ్యాధి నివారణకు ఏకైక మార్గమని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. బుధవారం భీమిని పీహెచ్సీ పరిధిలోగల జన్కాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణ కోసం అవగాహన కల్పించారు. రెండు వారాలపాటు దగ్గు ఉన్నట్లయితే దానిని క్షయ వ్యాధిగా అనుమానించాలని సూచించారు.
జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణ కోసం తెమడ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ పూర్తయ్యే వరకు ప్రతి నెల రూ 1000 పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా సోకుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స అందిస్తే వ్యాధిని అరికట్టవచ్చని సూచించారు. ముఖ్యంగా పొగాకు నమిలే వారిలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుందన్నారు. వైద్య శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. ఎక్స్ రే అవసరం ఉన్నవారిని 102 వాహనం ద్వారా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షల అనంతరం తిరిగి గ్రామానికి తీసుకువస్తామన్నారు. అనంతరం బిపి, షుగర్, హెచ్ఐవి, ఏర్పటైటిస్ బి, టీవీ పరీక్షలు నిర్వహించారు.