20-08-2025 11:15:31 PM
చేర్యాల: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు నెలల క్రితం ప్రమాదవ శాత్తు గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో తొలిసారిగా బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చేర్యాలకు వచ్చి స్థానిక రేణుక గార్డెన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... తాను ఇంత త్వరగా ప్రజా క్షేత్రంలోకి వస్తానని ప్రతిపక్షాలు ఊహించలేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తిరుగులేదని అనుకున్నారని అలాంటి క్రమంలో దేవుడు,ప్రజల ఆశీర్వాదం డాక్టర్ల కృషి వల్ల తొందరగా కోలుకున్నానని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి పార్టీని మారిన వారిని తిరిగి పార్టీలోనికి చేర్చుకునే ప్రసక్తే లేదని కొత్త వారికి మాత్రం అవకాశం ఇవ్వడం జరుగుతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కొట్లాడి ఇండ్లు తెచ్చుకున్నామని పేదవారికి మాత్రమే ఇండ్లు ఇవ్వడం జరిగిందని వారు ప్రస్తుతం నిర్మించుకుంటున్నారని అన్నారు.
అదే కాంగ్రెస్ ప్రభుత్వం వారు పేదలకు కాకుండా ఇతరులకు ఇండ్లు మంజూరు చేశారని వారిలో ఎంతమంది నిర్మించుకుంటున్నారో తెలుపవలసిన బాధ్యత ఉందని అన్నారు.జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న డివిజన్ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుందని డివిజన్ సాధించేవరకు పోరాటం ఆగదని అన్నారు.తాను రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న సమయంలో సైతం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేశారని అదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.