calender_icon.png 21 August, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతారంలో పడగ విప్పిన 'డెంగ్యూ'..?

20-08-2025 11:06:51 PM

పెన్ పహాడ్: వర్షాకాలం వచ్చింది.. ఊరినిండా దోమలు.. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి.. బజారుకు ఒక్కరో ఇద్దరో మంచానికి మూలుగుతున్నారు..అనంతారం పల్లె దవాఖాణాకు చెందిన డాక్టర్ (ఎమ్ఎల్ ఎచ్ పీ)ని తిరిగి మా గ్రామానికి కెటాయించి మా పేద ప్రాణాలు కాపాడాలని..రెక్కాడితే డొక్కాడని పేదలు వైద్యారోగ్యశాఖ అధికారులను వేడుకుంటున్నట్లు ఈనెల 11న 'విజయక్రాంతి'లో 'అనంతారంలో కరువైన ప్రభుత్వ వైద్య సేవలు' అనే శీర్షిక ప్రచురించింది. అయినా జిల్లా ఉన్నత అధికారులు స్పందించక పోవడం..వైద్య క్యాంపులు నిర్వహించక పోవడంతో పేద ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందక అనంతారంలో ముగ్గురు డెంగ్యూ భారిన పడ్డారనే ఆరోపనలు గ్రామస్తుల నుంచి వెలువడుతున్నాయి.

అంతేకాదు చీదెళ్లలో ఒక్క ఇంట్లోనే మరో ఇద్దరు డెంగ్యూతో సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిర్ణయాలలో నిర్లక్ష్యం వహించడంతో ప్రజాఆరోగ్యం కాటికి దగ్గర చేర్చేతున్నారని ఆరోపనులు మిన్నంటుతున్నాయి. డిప్యూటేషన్ పై వెళ్ళిన ఎమ్ఎల్ ఎచ్ పీని మాగ్రామానికి రప్పించాలని ఏకంగా డిప్యూటీ డీఎంహెచ్ఎ, అడ్మిస్ట్రేటివ్ అధికారి కోటిరత్నంకు అనంతారం గ్రామస్థులు వినతి పత్రంతో మొర పెట్టుకున్నా నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు పెర్కోంటున్నారు.

దీంతో అనంతారంకు చెందిన గొర్ల కాపరి, దళితుడు మామిడి చంద్రయ్య, వ్యవసాయ రోజు వారి కూలీ నిమ్మల సుగునమ్మ, నిండు గర్భిణీ శేక్. సమ్రీన్ కు జ్వరం రావడంతో గ్రామములో పల్లె డాక్టర్ లేక పోవడంతో గ్రామములో ఆర్ఎంపీని ఆశ్రయించారు. అయినా వీరి పరిస్తితి విషమించడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి రేఫర్ చేశారు. అక్కడ వైద్యులు ఈ ముగ్గురికి డెంగ్యూ ని నిర్ధారించి సేవలు అందించడంతో బతికి బయట పడ్డారు. అంతేకాదు వీరంతా వేల రూపాయలు అప్పులు తెచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో దార పోసి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేధన వ్యక్తం చేశారు.

అంతేకాదు చీదెళ్ళలో ఒకే కుటుంబంలోని తండ్రి తుమ్మల లింగయ్య, కూతురు తుమ్మల తులసికి జ్వరంతో బాధపడుతూ సూర్యాపేట ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ వైద్యాధికారులు డెంగ్యూ అని నిర్ధారించడంతో చికిత్స పొందుతున్నారు. 'చేతులు కాలాక..ఆకులు పట్టుకోక ముందే' ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టి మండలంలో అన్ని గ్రామాలలో వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని.. అలాగే అనంతారం గ్రామానికి పల్లె డాక్టర్ ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.