calender_icon.png 21 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఉద్రిక్తత

20-08-2025 11:40:28 PM

గజ్వేల్: గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లన్న సాగర్ నిర్వాసితులైన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన  అరికెల చంద్రంను అప్పటి కలెక్టర్, ఆర్డిఓ అనంతరెడ్డి బుజ్జగించి గ్రామంలో ఇల్లు ఖాళీ చేయించారు. చంద్రం పునరావాసం ప్యాకేజీ కింద ప్లాటును ఎంచుకోవడంతో  గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అసంపూర్తిగా నిర్మాణమైన ఇంటిలో ఉంచారు. కొద్దిరోజులకు చంద్రం తమకు ఇల్లు ఇవ్వాలని  ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు మళ్లీ ప్రభుత్వానికే డిడి కట్టాడు.  అధికారులు ఇవ్వలేమని డిడిని తిరిగి చంద్రంకే చెల్లించారు.

అధికారులు తనకు ఇల్లు కేటాయిస్తారన్న ఆశతోనే చంద్రం తాత్కాలికంగా నివాసం ఉన్న ఇంటిని రూ. 13 లక్షల ఖర్చుతో నివాసానికి మరింత అణువుగా మార్చుకున్నాడు. కొద్ది రోజులకు చంద్రం ఉంటున్న ఇంటిని అధికారులు మాధవ రెడ్డి అనే మరొక వ్యక్తికి  రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మాధవరెడ్డి తన ఇల్లు ఖాళీ చేయాలంటూ చంద్రం కుటుంబాన్ని అడిగారు. తాము ఇంటి మరమ్మతులకు ఖర్చుపెట్టిన డబ్బులను చెల్లిస్తే వెళ్ళిపోతామని చెప్పగా, మాధవరెడ్డి చెల్లించడానికి నిరాకరించారు. తన ఇంటిని తనకు అప్పగించాలని కోర్టు ద్వారా  ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్డీవో తహసిల్దార్ ఆదేశాలతో గజ్వేల్ ఆర్ ఐ కృష్ణ, రెవిన్యూ సిబ్బంది,  పోలీసుల సహాయంతో  అరికెల చంద్రమును ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఇంటి మరమ్మతుకు ఖర్చుపెట్టిన డబ్బులు మాకు చెల్లించాలని చంద్రం కుటుంబ సభ్యులు కోరినా ఫలితం లేకపోయింది. అప్పులు చేసి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఇల్లును బాగు చేశామని తమ దగ్గర పైసా లేదని, మేము ఎక్కడికి వెళ్లి బతకాలని చంద్రం కుటుంబ సభ్యులు గుండెల బాధ కుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ ఆర్డీవో తహసిల్దార్ ఆదేశాల మేరకు సిబ్బంది, పోలీసులు చంద్రం కుటుంబాన్ని బయటకు పంపి ఇల్లు ఖాళీ చేయించి మాధవరెడ్డికి తాళాలు అప్పగించారు. దీంతో చంద్రం తన కుటుంబంతో కలిసి గజ్వేల్ ప్రధాన రహదారిపైకి వస్తున్న క్రమంలో తల్లి సత్తెమ్మ ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అందరూ హడావిడిగా ఉన్న సమయంలో చంద్రం తన భార్య లావణ్య పిల్లలతో కలిసి కనిపించకుండా పోయారు. ఈ మేరకు ఏటిగడ్డ కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాపరెడ్డి, చంద్రం బంధువులు, గ్రామస్తులు గజ్వేల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు.