06-08-2025 11:25:16 PM
గురుకుల బాలికలకు పోక్సో చట్టంపై, జీవన నైపుణ్యాలు పెంపుపై అవగాహన కలిగించిన కలెక్టర్, అధికారులు..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో భగీరథ కాలనీలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల 1, 2, 3ను కలెక్టర్ విజయేందిర బోయి(Collector Viziendira Boyi), మహిళా అధికారులు, భరోసా కేంద్రం సిబ్బంది, తదితరులు బుధవారం రాత్రి సందర్శించారు. పిల్లలకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మహిళా అధికారులు, భరోసా సెంటర్ టీమ్, అర్. బి.ఎస్.కె.టీమ్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగించారు. ముఖ్యంగా పిల్లలు దగ్గరి, తెలిసిన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దృఢంగా ఉండాలి. లైగింక వేధింపులకు పాల్పడిన, శరీర భాగాలు టచ్ చేసిన వెంటనే తల్లిదండ్రులకు, టీచర్లకు తెలుపాలని అన్నారు.
అదేవిధంగా జీవన నైపుణ్యాలు గురించి వ్యక్తిత్వ వికాసం గురించి వివరించారు. కోమల్ అనే బాలిక వీడియో ప్రదర్శించారు. భగవంత్ కేసరి సినిమాలో హీరో బాలకృష్ణ చెప్పే కూతురుకు ధైర్యం నూరిపోసి తనపై విశ్వాసం కలిగేలా చెప్పే డైలాగులు వినిపించారు. పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి రాత్రి భోజనం చేశారు. గురుకులంలో రాత్రి బస చేశారు. కలెక్టర్ వెంట మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, ఎస్సి అభివృద్ది అధికారిణి సునీత, బిసి అభివృద్ది అధికారిణి ఇందిరా, డి.అర్.డి. ఏ అదనపు పి.డి.లు శారద, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి పద్మజ, అర్.బి.ఎస్. కె టీమ్,భరోసా టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.