calender_icon.png 7 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

06-08-2025 11:20:21 PM

నంగునూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని, ఎవరూ కూడా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నంగునూర్ మండల ప్రత్యేక అధికారి, డీపీవో దేవకీ దేవి(DPO Devaki Devi) సూచించారు. నంగునూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంఆర్ఓ సరితతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలోని మొత్తం 512 మందికి మొదటి దశలో ఇళ్లు మంజూరు అయ్యాయని, ఎంపీడీఓ లాగిన్‌లో ఉన్న 694 మందిలో మిగిలిన 182 మందికి వివిధ కారణాల వల్ల మంజూరు కాలేదని, వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాలమాకుల గ్రామానికి చెందిన వర్ధోలు బుచ్చవ్వ అనే లబ్ధిదారుని గురించి ప్రస్తావించారు.

బుచ్చవ్వ పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ, రెండవ దశలో ఆమెకు ఇల్లు మంజూరు అవుతుండగా, ఆమె తొందరపడి అనవసరమైన నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని దేవకీ దేవి హామీ ఇచ్చారు. మంజూరైన 512 ఇళ్లలో ఇప్పటివరకు 292 ఇళ్లకు ముగ్గు పోయడం జరిగిందని, 19 ఇళ్ల బేస్‌మెంట్‌ పనులు పూర్తయ్యాయని వివరించారు. మొదటి విడతలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 1,00,000 జమ అయ్యాయని పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించుకునే వారికి తహసీల్దార్ ద్వారా 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను కూడా అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంఆర్ఓ సరిత,హౌసింగ్ ఏఈ వివేక్ తదితరులు ఉన్నారు.