07-08-2025 04:23:51 PM
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తలసాని
సనత్‌నగర్ (విజయక్రాంతి): రెండు, మూడు రోజులలో నాలా పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. అమీర్ పేట డివిజన్ లోని గాయత్రి నగర్ లో చేపట్టిన నాలా నిర్మాణ పనులు పూర్తికాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయించాలని కాలనీ వాసులు ఇటీవల మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేరోజు అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగా గురువారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి నాలాను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలా పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టింగ్ పనులను అధికారులు ప్రారంభించగా, నాలా పై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గాయత్రి నగర్ లో వర్షపునీరు రోడ్లపై నిలిచి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి శాశ్వత పరిష్కారం చూపాలని నాలా నిర్మాణం పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ పనుల పూర్తితో గాయత్రి నగర్ వాసుల ఎన్నో సంవత్సరాల సమస్య పరిష్కారం అయినట్లేనని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, EE వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ GM ప్రభాకర్, టౌన్ ప్లానింగ్, సయ్యద్, ఎలెక్ట్రికల్ AD కిషోర్, డివిజన్ BRS అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహన్, కట్టా బలరాం, టిల్లు బాయ్, కాలనీ వాసులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.