17-01-2026 07:26:59 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత వీక్లీ మార్కెట్ (ఇంటిగ్రేటెడ్ మార్కెట్) భవనంలో బాన్సువాడ పట్టణ డ్వాక్రా, మెప్మా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెద్ద పీఠ వేస్తోందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు.కుటీర పరిశ్రమల ద్వారా మహిళలు నెలవారీ ఆదాయం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నారు.మహిళలను అర్థికంగా బలోపేతంచేయడం కొరకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు పరిశ్రమను సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను తీసుకువచ్చి యంత్రాలు పనిచేసే విధానంపై అవగాహన కల్పించారు.
మహిళలు తమకు నచ్చిన రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఉదాహరణకు ఆహార పదార్థాలు (ఫుడ్ ప్రాసెసింగ్), అలంకరణ వస్తువులు (కాస్మెటిక్స్), వస్త్రాలు, చేతివృత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు అని ఆయన అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు డ్వాక్రా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో బాన్సువాడ పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.