14-10-2025 09:31:36 PM
మందమర్రి (విజయక్రాంతి): పొగాకు ఉత్పత్తుల నివారణ, సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని ప్రభుత్వ వైద్యులు రమేష్, మానసలు కోరారు. పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సిపిఆర్ పై అవగాహన కల్పించారు. సిపిఆర్ విధానం ద్వారా మనిషిని బ్రతికించవచ్చని, దీనిపై ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, యూత్ సంస్థలు, కాలేజీ విద్యార్థులు, ప్రజలలో అవగాహన కలిగించి మరణాలు లేకుండా చూడాలని కోరారు. అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల ద్వారా చాలామంది చనిపోవడం జరుగుతుందని, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, వంటి వాటికి కారణమవుతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు.
పొగ త్రాగే వారి కన్నా పొగ పీల్చేవారు కూడా ఈ వ్యాధులకు గురి కావాల్సి వస్తుందన్నారు. జిల్లాలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పొగాకు వాడకం అభివృద్ధికి ఆటంకం అనే నినాదంతో చర్యలు చేపట్టడం జరిగిందని పొగాకు ఉత్పత్తులైన తంబాకు, గుట్కా, సిగరెట్టు బీడీ, మత్తు, వంటి వాటికి దూరంగా ఉండాలని, వీటి ద్వారా ఎంతో హానికరమైన పొగ వలన మన శరీరంలోని అవయవాలు దెబ్బ తింటాయన్నారు. మానవాళికి నష్టం చేకూర్చే పొగాకు ఉత్పత్తులతో పాటు సిపిఆర్ విధానంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని ఆశ ఆరోగ్య కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లింగారెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ లు పాల్గొన్నారు.