23-06-2025 12:03:08 AM
కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన
నర్సాపూర్(మెదక్), జూన్ 22(విజయక్రాంతి): మానవత్వం మంటగలిసింది...ఓ పసికందును కర్కషంగా అడవిలో పడేసిన అమానవీయమైన సంఘటన వెలుగులోకి వచ్చింది..మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో నాలుగు నెలల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళారు..వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం నాడు మెదక్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కొందరు వాహనదారులు కొండాపూర్ అటవీ ప్రాంతంలో మూత్ర విసర్జనకు వెళ్ళారు. అక్కడి సమీపంలో శిశువు ఏడుపు విని వెళ్లి చూడగా సుమారు నాలుగు నెలల వయస్సు గల పసికందు పొదల్లో కనిపించింది.
దీంతో స్పందించిన వాహనదారులు శిశువును ఎత్తుకొని 100 డయల్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని శిశువును తీసుకొని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఐసీడీఎస్ సిబ్బందికి శిశువును అప్పగించారు. అటవీ ప్రాంతంలో పసికందును వదిలివెళ్ళిన వారు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ లింగం తెలిపారు.