calender_icon.png 21 July, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌కు బెయిల్

11-05-2024 01:17:59 AM

లిక్కర్ కేసులో మంజూరుచేసిన సుప్రీం కోర్టు 

 జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం

స్యూఢిల్లీ, మే 10: ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ చివరి దశ పోలింగ్ జరిగే వరకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

జూన్ 2వ తేదీ వరకు జైలులో లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. ఇక జూన్ 1వ తేదీ తర్వాత కూడా బెయిల్ పొడిగించేందుకు దాఖలయ్యే పిటిషన్లను వచ్చే వారం విచారిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికలు ముగిశాక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాక అంటే జూలై వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. అయితే జూన్ 1వ తేదీ వరకే బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు పలు షరతులు విధించింది.

ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూదడని, అధికార పత్రాలపై సంతకాలు చేయకూడదని, అలాగే సచివాలయంలోకి వెళ్లకూడదని షరతులు పెట్టింది.ఆయనకు నేరచరిత లేదు.. ‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఓ  జాతీయ పార్టీకి అధినేత. నిజమే.. ఆయనపై సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయనపై నేరం నిరూపణ కాలేదు. ఇంతకు ముందు ఆయన నేరాలు చేసినట్టు ఎలాంటి చరిత్ర లేదు. ఆయన వల్ల సమాజానికి ఎలాంటి ప్రమాదం లేదు’ అని బెయిల్ మంజూరు చేసే సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘అరవింద్ కేజ్రీవాల్‌కు 21 రోజులు బెయిల్ మంజూరు చేయడంలో పెద్ద సమస్య లేదు. ఇక్కడైనా (జైలులో), అక్కడైనా (బయట) 21 రోజులు పెద్ద తేడా ఏమీ ఉండదు’ అని తెలిపింది. గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కేజ్రీవాల్‌పై విచారణ జరుగుతోందని, కానీ సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే మార్చిలో ఆయనను అరెస్టు చేశారని సుప్రీం కోర్టు పేర్కొంది. ‘2022 ఆగస్టులో ఈడీ కేజ్రీవాల్‌పై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేసింది. కానీ ఈ ఏడాది మార్చిలో ఆయనను అరెస్టు చేసింది.

కేసు నమోదు చేసినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరం పాటు ఆయన బయట ఉన్నారు. ఆయనను అంతకుముందు కానీ తర్వాత కానీ అరెస్టు చేయొచ్చు. కానీ అలా జరగలేదు’ అని వివరించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కేసులో 16 మంది అరెస్టు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటివరకు ఈడీ 16 మందిని అరెస్టు చేసింది. ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను మొదటగా అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్ రావడంతో 9 నెలల పాటు  బయట ఉండి తిరిగి జైలులో లొంగిపోయారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా బెయిల్ మంజూరైంది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అభిషేక్ బోనపల్లి, పి.శరద్‌రెడ్డి, బినయ్ బాబు ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఎమ్మె ల్సీ కవిత,  విజయ్ నాయర్, దినేశ్ అరోరా, సమీర్ మహేంద్రు తదితరులు జైలులో ఉన్నారు.

50 రోజుల తర్వాత బయటకు..

అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో శుక్రవారం సాయంత్రం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సాయంత్రం ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులతో ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన నుంచి విముక్తం చేయాలని దేశంలోని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.. నా శాయశక్తులా నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉన్నాను. 12 గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతాం’ అని కేజ్రీవాల్ ర్యాలీలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం గెలుపు: సునితా కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘హనుమాన్‌కీ జై. ఇది ప్రజాస్వామ్యం గెలుపు. లక్షలాది మంది ప్రార్థనలు ఫలితమే ఇది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు.