21-07-2025 08:18:04 PM
కృష్ణా పట్టే ప్రాంతంలో ఉలిక్కిపడ్డ నకిలీ మద్యం దందా..
మేళ్లచెరువు మండలంలో నకిలీ మద్యం తయారు చేసే ముఠా అరెస్ట్..
ఆరుగురు నిందితులపై కేసు నమోదు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా నలుగురు నేరస్తుల పరార్..
వైన్ షాపుల్లో హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారుల సోదాలు..
15 లక్షల రూపాయల నకిలీ మద్యంతో పాటు స్పిరిట్ ఖాళీ సీసాలు పట్టివేత..
తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫొర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి..
హుజూర్ నగర్/మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా(Suryapet District) హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తన సిబ్బందితో సోమవారం జరిపిన అకస్మిక దాడుల్లో ఈ నకిలీ దందా బట్టబయలైంది. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన తోట శివ శంకర్ అను వ్యక్తి సూర్యప్రకాష్ కు చెందిన ఓ రేకుల షెడ్ గోదాంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద సుమారు 832 లీటర్ల స్పిరిట్, ఖాళీ బాటిల్స్ లో స్పిరిట్ ను నింపి కాప్స్ బిగించి నకిలీ లేబుళ్లను అతికించి ఉన్న సుమారు 15 లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని గుర్తించి పోలీసులు పట్టుకున్నారు.
అంతే కాకుండా సుమారు రెండు కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసే స్పిరిట్ తో పాటు 326 లీటర్ల బ్యాటిల్ లో నింపబడిన 38 కాటన్ల ఎంసి విస్కీ బాటిల్స్, ఖాళీ సీసాలతో పాటు నిందితుల వద్ద నుంచి ఏపీ 07 డీజెడ్ 6789 గల కారును స్వాధీనం చేసుకొని హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నకిలీ మద్యం ముఠాకు సంబంధించి శివ శంకర్, శ్రీరాం మహేష్, హైదరాబాద్ కు చెందిన రూతుల శ్రీనివాస్, శ్రీ కృష్ణా ఫార్మా కు చెందిన శివ చరణ్ సింగ్, షెడ్ ఓనర్ సూర్య ప్రకాష్, ఈ కేసుకు సంబంధించి ఆరుగురుపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
మేళ్లచెరువు మండలంతో పాటు చింతలపాలెం మండలాల్లో అక్రమ మద్యం తయారీపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేసినట్లు వారు తెలిపారు. హైదరాబాద్ నుండి స్పిరిట్ తీసుకువచ్చి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మద్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఏపీలోని మార్కాపురం రేపల్లె అమలాపురంతో పాటు మరికొన్ని చోట్ల ఈ ముఠా మద్యం అమ్మినట్లు తెలిపారు. ప్రధానంగా మేళ్లచెరువు మండల కేంద్రంలో వైన్స్ కౌంటర్ లో విధులు నిర్వహిస్తున్న శంకర్ తో పాటు మరి కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులో తీసుకొని విచారించగా విషయం బయటపడ్డట్లు తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫొర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు జగన్మోహన్ రెడ్డి, వెన్నెల, ఎక్సైజ్ పోలీసులు రవి, నాగరాజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.