20-09-2025 12:00:00 AM
సిద్దిపేట, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని శివాజీనగర్ ప్రాం తం ప్రస్తుతం ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల కేంద్రంగా మారింది. ప్రైవేట్ ఆస్ప త్రులు వరుసగా నిర్మాణం చేసుకుంటూ పార్కింగ్ ప్లేస్, సెట్బ్యాక్, అగ్నిమాపక భద్రతా నిబంధనలు వంటి ప్రాథమిక నియమాలను సైతం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే విజయక్రాంతి పత్రికలో పార్కింగ్ లేని ప్రైవేట్ ఆస్పత్రులపై కథనం వెలువడినా, అధికారులు మౌనమే వహిస్తున్నారు. ఫలితంగా బాటసారులు, వాహనదారులు, అత్యవసర సేవలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.
జనరేటర్లతో సెట్‌బ్యాక్ స్థలాల ఆక్రమణ..
మున్సిపల్ చట్టాల ప్రకారం, భవన యజమానులు సెట్‌బ్యాక్ స్థలం ఖాళీగా ఉంచాలి. కానీ వాస్తవానికి ఆ స్థలాల్లోనే జనరేటర్లు, ర్యాంపులు, వాహన పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్వేచ్ఛ హాస్పిటల్ భవనం సెట్‌బ్యాక్ స్థలంలో జనరేటర్ పెట్టడంతో పక్కనే ఉన్న కొత్త భవనానికి అవసరమైన జనరేటర్ స్టేట్ బ్యాక్ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు.
ఇదంతా మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతుందని అందుకే స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. నిబంధనలు పాటించకపోవడమేనంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి..
ప్రైవేట్ ఆస్పత్రుల జోన్‌లో పార్కింగ్ సమస్యలు, రోడ్డు రాకపోకల ఇబ్బందులు, అంబులెన్స్లకే దారి దొరకని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు కేవలం కాగితాల మీదే నిబంధనలు అమలు చేస్తున్నారు. వాస్తవానికి మాత్రం డబ్బుల కోసం అక్రమ నిర్మాణాలకు దండం వేసి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాలు కేటాయించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.