03-09-2025 10:26:39 PM
వడ్డెపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డెపల్లి చర్చి జంక్షన్లో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతిని రద్దు చేయాలని వడ్డెపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ను కోరారు. బుధవారం హనుమకొండలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వడ్డెపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపెల్లి రవీందర్ (జేకే), ప్రధాన కార్యదర్శి తాళ్లవెల్లి ప్రవీణ్ కుమార్, కోశాదికారి నల్ల ఆశీర్వాదంలు మాట్లాడుతూ... వడ్డెపల్లి చర్చి ప్రాంతానికి మంజూరైన బార్ అండ్ రెస్టారెంట్ ను నివాసాల మధ్య కాకుండా వేరే ప్రాంతానికి మార్చాలని అన్నారు. చర్చి ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఐదు చర్చిలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, పీజీ మహిళా కళాశాలలు ఉన్నాయని అన్నారు. చర్చి ప్రాంతంలో బార్ షాపు నెలకొల్పితే మహిళలు, విద్యార్థినీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు.