calender_icon.png 5 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్ వేషాలు!

05-09-2025 01:12:45 AM

సూర్యాపేట జిల్లాలో నాటకాల రాయుళ్లు

-వందల మందిని మోసగించిన వైనం

-ఒక్కొక్కరి నుంచి 15 వేలు వసూళ్లు 

-మొత్తంగా దండుకున్నది రూ.70 లక్షలు

సూర్యాపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): సమాజ హితానికి పాటుపడు తున్న కళాకారుల సేవలు గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవడానికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయిం చాయి. దానిలో భాగంగానే అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.

దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు స్వార్థపరులు నకిలీ కళాకారులతో పింఛన్ ‘వేషాలు’ వేయిస్తున్నారు. పద్యాలు పాడకున్నా, వేషాలు ధరించకున్నా, అసలు రంగస్థలంపైన కాలు మోపకున్నా పర్లేదు. వారు పింఛన్ పొందేందుకు అర్హులేనం టూ.. ఇద్దరు కళాకారులు సుమారు 300 మందిని మోసగించి రూ. 70 లక్ష ల వరకు పోగేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారి గూడెం గ్రామంలో వెలుగుచూసింది.  

ఒక్కరిద్దరితో ప్రారంభమై

సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి కళాకారులు. వారిద్ద రు కలిసి నకిలీ కళాకారులను తయారు చేసి డబ్బులు దండుకున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ భాష, సాంసృతిక శాఖలోని కొందరితో సంబంధాలు ఏర్పడ టంతో నకిలీ కళాకారులకు పింఛన్లు ఇప్పిస్తామంటూ వేషాలు మొదలుపెట్టారు.

2018లో జిల్లాలో ఒక్కరిద్దరితో ప్రారంభమైన ఈ తంతు నేటికి వందలసంఖ్యలోకి చేరడం గమనార్హం. వీరు నటన రాని, గొంతెత్తని వ్యక్తులను ఎంపిక చేసుకుంటారు. వారి ఆర్థిక స్థితిగతులను గమనించి పింఛన్‌లు ఇప్పిస్తామని రూ. 15వేల నుంచి -35వేల వరకు బేరం కుదుర్చుకుంటారు.

దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్లు, కావాల్సిన వేషధారణ ఫొటోలు, కంప్యూటర్‌లో మార్ఫింగ్ చేసి వాటితో దరఖాస్తులు చేయిస్తున్నారు.గతేడాది కోదాడలో జరిగిన కళా కారుల సమావేశానికి సుమారు 500 మం ది కళాకారులను తీసుకెళ్లారు. అక్కడికి వచ్చి న పేరుగాంచిన కళాకారులను చూపించి, పింఛన్లు వస్తాయని చెప్పి అక్కడే సుమారు వందమంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు సమాచారం. 

నకిలీ జాబితా చూపి..

బాధితుల నుంచి ముందుగా కొంత డ బ్బు వసూలు చేసిన తర్వాత కొన్ని నెలలు ఆగి తదుపరి ఓ నకిలీ పేర్ల జాబితా తయారు చేస్తారు. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన లిస్ట్,  ఇం దులో మీ పేరు ఉంది, మీకు పింఛన్ డబ్బు లు రావాలంటే మరో రూ. 35 వేలు చెల్లించాలంటూ వసూలు చేస్తున్నారు. ఇవి చాల వన్నట్లు కళాకారుల పింఛన్‌కు దరఖాస్తు  చేసుకోవడానికి అవసరమైన రూ. 48 వేల లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సైతం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తామే తీసుకువస్తామని మరో రూ. 5 వేలు గుంజుతున్నారు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన సరిఫికెట్ల జీరాక్స్ పత్రాలపై వారే తయారు చేయించిన వివిధ శాఖల అధికారుల ముద్రలు వేసి, ఫోర్జరీ సంతకాలు చేస్తు న్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. 

     నకిలీ గుర్తింపు కార్డు అందజేత! 

కేంద్ర ప్రభుత్వ పింఛన్ కోసం పైసలు ఇచ్చిన వారికి తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ నుంచి మంజూరైనట్ల్లు ఓ గుర్తింపు కార్డు ఇచ్చారు. అయితే అది కూడా నకిలీదేనని తెలిసింది. దీనికి కారణం ఆ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రెండు, మూడు కార్డులకు ఒకే నంబర్ చూపుతున్నట్లు కొందరు బాధితులు చెపుతున్నారు. అలాగే కీతవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటనరసయ్య అనే వ్యక్తికి 40 ఏళ్ల లోపు వయసు ఉండగా అతని వయసు 65 ఏళ్లు చూపుతూ అతని ఫొటోని మార్ఫింగ్ చేసి వయసు మీరిన వ్యక్తిగా గుర్తింపు కార్డు ఇచ్చారు. మోసానికి తెరలేపిన కళాకారులు వెంకన్న, ముస్తఫాలపై చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.

ఉచ్చులో ఊర్లకు ఊర్లు 

పైసలిస్తే పింఛన్ పక్కా అనే ప్రచారం జోరందుకోవడంతో ఊర్లకు ఊర్లు ఈ పైరవీకారుల ఉచ్చులో పడిపోయాయి. హుజూ ర్‌నగర్ నియోజకవర్గంలోనే కీతవారిగూ డెం, మంగాపురం, రాయినిగూడెం, సర్వా రం, అమరవరం, ఖమ్మం జిల్లాలోని మధిర ప్రాంతం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలువురు వీరి మాయలో పడినట్లు  తెలిసింది. ఒక్క కీతవారిగూడెంలోనే సుమారు ౧౦౦ మంది బాధితులు ఉన్నారు.

వడ్డీకి తెచ్చి రూ. 30 వేలు ఇచ్చా

కళాకారుల పింఛన్ ఇప్పిస్తామని చెప్పడంతో 2023 సంవత్సరంలో గ్రామానికి చెందిన గుండు వెంకన్న, జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ముస్తఫా అనే వ్యక్తులకు రూ.30 వేలు ఇచ్చిన. ఇప్పటి వరకు పింఛన్ రాలే. అడిగితే రేపొస్తది, మాపొస్తది అని జరుపుతున్నారు. నేను డబ్బులు ఇచ్చే సమయంలో ఇక ఎన్నికల కోడ్ వస్తుంది. కోడ్ వస్తే మేము ఏం చేయలేం. తొందరగా ఇవ్వాలని చెప్పారు. సమయానికి నాకాడ డబ్బులు లేకపోవడంతో వడ్డీకి తెచ్చి ఇచ్చా. అయినా ఫలితం లేదు. దరఖాస్తు చేసి సంవత్సరం దాటింది. దాన్ని రెన్యువల్ చేయాలని మరో రూ.5 వేలు అడిగారు అవి కూడా ఇచ్చా. 

 రేఖ వెంకటనర్సయ్య, బాధితుడు, కీతవారిగూడెం

ఇంతవరకు పింఛన్ రాలే

మా గ్రామానికి చెందిన కళాకారుడు వెంకన్న ఉన్నడని నమ్మి నేను మూడేళ్ల క్రితం డబ్బులు ఇచ్చిన. ఆయనకు తోడు ముస్తఫా అనే వ్యక్తి కూడా వచ్చిండు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పింఛన్ వస్తదని చెప్పిండ్రు. నేను బ్యాండ్ ఆర్గనైజర్‌ని కావడంతో నా వద్ద 20మంది వరకు పని చేస్తున్నారు. నేను డబ్బులు ఇచ్చానని వారికి చెప్పడంతో వారు కూడా నాపై నమ్మకంతో డబ్బులు ఇచ్చారు. దీంతో నాతో పాటు వారు కూడా మోసపోయారు. అధికారులు ఇటువంటి మోసాలను అరికట్టాలి.  

 పాలెల్లి ముత్తయ్య, బాధితుడు

ఫిర్యాదు అందలేదు 

కళాకారుల పింఛన్ ఇప్పిస్తామనే మోసానికి సంబంధించి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. బాధితుల నుంచి ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

జి చరమందరాజు, సీఐ, హుజూర్‌నగర్