calender_icon.png 5 September, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం చారిత్రాత్మకం

05-09-2025 01:02:30 AM

-మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఊరట

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కోట్లాది మందికి మేలు జరిగేలా జీఎస్టీ స్లాబ్‌లను కుదించి జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ స్లాబ్‌లను కుదించడంతో సామాన్యులకు నేరుగా ఆర్థిక ఊరట కల్పించినట్టయిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ర్ట శాఖ స్వాగతిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

కాంగ్రెస్ వ్యాఖ్యను ఖండిస్తున్నాం

మోదీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ -వన్ లా వంటి సంస్కరణలు తీసుకొచ్చిందని, ఇప్పటివరకు అమలులో ఉన్న బ్రిటిష్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని రాంచందర్‌రావు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ త్వరలో 5 ట్రిలియన్ ఎకానమీని చేరే దిశలో ఉన్నదని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని, ముఖ్యంగా, మోదీ తల్లిని దూషించేలా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. జీఎస్టీ తగ్గించినందుకు, పండుగ సమయంలో ప్రజలకు ఊరట ఇచ్చినందుకు బీజేపీ రాష్ర్ట శాఖ ఆధ్వర్యంలో మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ర్టంలోని అన్ని మండలాల్లో క్షీరాభిషేకం కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోందని, మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తోందని, అయితే రాష్ర్టంలో బ్లాక్ మార్కెట్‌ను ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించారు.