03-09-2025 10:35:37 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే యాకోబు, గ్రామపంచాయతీ వర్కర్స్ సంఘం అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయటం లేదని తెలిపారు. కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని వారు కోరారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాలని కోరారు. ఏ వస్తువుల ధరలైన సామాన్యునికి అందుబాటులో లేకుండా ఆకాశానందుతున్నాయని, కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామపంచాయతీ కార్మికులకు కేవలం పదివేల రూపాయల వేతనాన్ని చెల్లించడం దారుణం అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని వారి డిమాండ్ చేశారు.