23 June, 2026 | 1:05 AM

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం

23-06-2026 12:00 AM
  1. నాలుగు విమానాశ్రయాలు మూసివేత
  2. 385 డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా ఎయిర్ డిఫెన్స్
  3. రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్‌లో నలుగురు మృతి
  4. మరో ఐదుగురికి గాయాలు

మాస్కో/కీవ్, జూన్ 22: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించింది. మాస్కో, దాని సమీప నగరాలపై సోమవారం దాదాపు 385 డ్రోన్లను ప్రయోగించింది. దీంతో మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలను మూసివేసింది. వీటిని కూల్చివేశామని రష్యా ఎయిర్ డిఫెన్ష్ అధికారులు తెలిపారు. అలాగే ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో మహిళ మృతి చెందారు. మొత్తం ఐదుగురు గాయపడ్డారు.

ఉక్రెయిన్ మాస్కో, తాము నియంత్రించే భూభాగాల వైపు మరిన్ని డ్రోన్లను ప్రయోగించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి సమయంలో పలు రష్యన్ ప్రాంతాలు, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పం, అజోవ్ సముద్రం, నల్ల సముద్రంపై తమ బలగాలు 301 ఉక్రేనియన్ డ్రోన్లను అడ్డుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 84 ఉక్రేనియన్ డ్రోన్లను కూడా కూల్చివేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు.

ఈ దాడి వల్ల ఏదైనా నష్టం జరిగిందా లేదా అని ఆయన చెప్పలేదు. కానీ ఈ దాడి నేపథ్యంలో మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలు తాత్కాలికంగా తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. అలాగే, ఈ దాడి ఫలితంగా మాస్కోకు తూర్పున ఉన్న రష్యా వ్లాదిమిర్ ప్రాంతంలో, రాజధానికి దక్షిణాన ఉన్న తుల ప్రాంతంలో కొన్ని నివాస భవనాలను ఖాళీ చేయించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అలాగే ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

మరణించిన వారిలో తండ్రి, అతని అత్త, 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి ఒలేహ్ హ్రిహోరోవ్ తెలిపారు. ఆగ్నేయ ఉక్రెయిన్ నగరమైన జపోరిజ్జియాలో రష్యా జరిపిన రాత్రిపూట డ్రోన్ దాడిలో ఒక మహిళ మరణించగా, 11 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురు గాయపడ్డారని ప్రాంతీయ అధిపతి ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. రాత్రి సమయంలో రష్యా మొత్తం 88 సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 79 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని పేర్కొంది.